Aruna Miller: అమెరికాలో మన అరుణోదయం

ప్రపంచ రాజకీయాల్లో మన వాళ్ల హవా నడుస్తోంది. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో తెలుగు ఆడపడుచు చరిత్ర సృష్టించింది. మేరీల్యాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా గెలిచి, ఆ ఘనత సాధించిన తొలి భారత సంతతి వ్యక్తిగా కాట్రగడ్డ అరుణ మిల్లర్‌.. నిలిచారు. రాజకీయాలంటే ఆసక్తి లేని ఈ తెలుగు తేజం.. ఈ స్థాయి వరకూ ఎలా వచ్చారో చదివేయండి.

Updated : 10 Nov 2022 08:55 IST

ప్రపంచ రాజకీయాల్లో మన వాళ్ల హవా నడుస్తోంది. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో తెలుగు ఆడపడుచు చరిత్ర సృష్టించింది. మేరీల్యాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా గెలిచి, ఆ ఘనత సాధించిన తొలి భారత సంతతి వ్యక్తిగా కాట్రగడ్డ అరుణ మిల్లర్‌.. నిలిచారు. రాజకీయాలంటే ఆసక్తి లేని ఈ తెలుగు తేజం.. ఈ స్థాయి వరకూ ఎలా వచ్చారో చదివేయండి.

‘నేనో ఇంజినీర్‌ని. రాజకీయవేత్తను కాదు’.. 2010 ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా అవకాశమొచ్చినప్పుడు అరుణ అభిప్రాయమిది. ఈవిడది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా వెంట్రప్రగడ. అమ్మ హేమలత. నాన్న కాట్రగడ్డ వెంకట రామారావు ఇంజినీర్‌. ఆయన ఉద్యోగరీత్యా వీళ్లు 1972లో అమెరికాలో స్థిరపడ్డారు. అప్పటికి తనకు ఏడేళ్లు. అరుణ మిస్సోరి యూనివర్సిటీ నుంచి సివిల్‌ ఇంజినీరింగ్‌లో పట్టా పొందారు. వర్జీనియా, హవాయి, కాలిఫోర్నియాల్లో రవాణా ఇంజినీర్‌గా పని చేశారు. 1990లో మేరీల్యాండ్‌ మాంట్‌ గొమెరీ కౌన్సిల్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌కి మారారు. స్నేహితుడు డేవ్‌ మిల్లర్‌ని పెళ్లాడారు. మొదట్నుంచీ సామాజిక సేవపై ఆసక్తి. పాఠశాలలు, ఉపాధి, కమ్యూనిటీ కేంద్రాలు అందరికీ అందుబాటులో ఉండేలా చూశారు. వికలాంగులు, పాదచారులు, సైకిల్‌ నడిపేవారికి అనువుగా ఉండేలా రూపొందించిన కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందారు. పాతికేళ్లు సేవలందించి 2015లో ఉద్యోగ విరమణ చేశారు.

2000లో అమెరికా పౌరసత్వాన్ని పొందిన అరుణ  ఆ ఏడాదే మొదటిసారి ఓటు వేశారు. ‘ఆ క్షణాల్ని ఎప్పటికీ మర్చిపోలేను. కొంత భావోద్వేగానికీ గురయ్యా’నని చెబుతారు. అయితే తను మద్దతు తెలిపిన అభ్యర్థి ఓడిపోయారు. తర్వాతా అదే పరిస్థితి. దాన్ని తట్టుకోలేక ఆమె కార్యకర్తగా  మారారు. డెమొక్రటిక్‌ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వారు. ఆమె చురుకుదనం, పేరు ప్రఖ్యాతులకు మెచ్చి 2010లో మేరీల్యాండ్‌లో డెమొక్రటిక్‌ పార్టీ తరఫున డెలిగేట్‌గా పోటీ చేసే అవకాశమిస్తే ఆమె తిరస్కరించారు. ‘నీ లక్ష్యం ప్రజాసంక్షేమం. రాజకీయ నాయకులు చేసేదీ అదే కదా’ అన్న భర్త మాటలతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తొలి పోటీలోనే గెలిచి, మేరీల్యాండ్‌కు తొలి భారతీయ అమెరికన్‌ డెలిగేట్‌ అయ్యారు. అమెరికాలో పెరిగినా భారతీయ మూలాలను ఎప్పటికీ మరవలేదంటారు ఆమె సన్నిహితులు. మన సంస్కృతి, సంప్రదాయాలంటే ఆమెకు ఎనలేని ప్రేమ. మొదటిసారి గెలిచాక తన రాష్ట్ర గవర్నర్‌ని భారత్‌కి తీసుకొచ్చి పలు వ్యాపార విభాగాల్లో భాగస్వామ్య ఒప్పందాలు కుదిర్చారు.

2014లోనూ రెండోసారి డెలిగేట్‌గా ఎన్నికయ్యారు. రెవెన్యూ, రవాణా మొదలైన కీలక కమిటీల్లో సభ్యురాలయ్యారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీచేసిన తొలి మహిళ.. హిల్లరీ క్లింటన్‌ బృందంలో ఈవిడా ఒకరు. చీర, నుదుటిమీద ఎర్రటి బొట్టుతో ప్రపంచ దృష్టీ ఆకర్షించారు అరుణ. 2018లో ప్రతినిధుల సభకు పోటీ చేసి ఓడిపోయారు. తాజా గెలుపుతో మళ్లీ సత్తా చాటారు. బైడెన్‌ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నప్పుడూ అరుణ చురుగ్గా ప్రచారం చేశారు. అందుకేనేమో అధ్యక్ష ఉపాధ్యక్ష పదవుల్లో ఉన్నా బైడెన్‌, కమలా హ్యారిస్‌లు ఆమె తరఫున ప్రచారం చేశారు. చదువుకునే హక్కు, పాఠశాలలో ‘లేబర్‌ డే’, పర్యావరణ విధానాల్లో మార్పులు, విచ్చలవిడిగా ఆయుధాల లభ్యత వంటి ఎన్నింటిపైనో ఆవిడ పోరాడారు. తన కృషి ఫలితంగా కొన్ని విధానాలూ రూపొందాయి. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి రిపబ్లికన్‌ పార్టీ మద్దతుదారులూ ఆమెకు మద్దతివ్వడం విశేషం. ‘సాధించడానికి అబ్బాయిలు అమ్మాయిలు అని తేడా ఏమీ ఉండదనే వారు నాన్న. నచ్చింది చేయమని నన్ను, చెల్లిని ప్రోత్సహించారు. ఆ తోడ్పాటే దూసుకెళ్లే మనస్తత్వాన్ని అలవరించింది. నా ముగ్గురు అమ్మాయిలకీ ఇదే చెబుతుంటా’ అనే 58 ఏళ్ల అరుణని మేరీల్యాండ్‌ వాసులు ‘ఫైర్‌ బ్రాండ్‌’గా అభివర్ణిస్తుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని