అమెరికా వేదికగా ‘రాష్ట్ర పంచాయతీ’

గ్రామ పంచాయతీల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, ఆర్థిక సంఘం నిధులను విద్యుత్తు ఛార్జీల బకాయిలకు మళ్లించడంతో కుంటుపడిన గ్రామాభివృద్ధిపై ఇక్కడ పోరాటం చేస్తున్న ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ ప్రతినిధులు తమ ఆవేదనను అమెరికాలోనూ వినిపించనున్నారు.

Updated : 21 May 2023 05:35 IST

ప్రభుత్వ నిర్లక్ష్యంపై నాట్స్‌ సదస్సులో మాట్లాడనున్న సర్పంచులు

ఈనాడు, అమరావతి: గ్రామ పంచాయతీల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, ఆర్థిక సంఘం నిధులను విద్యుత్తు ఛార్జీల బకాయిలకు మళ్లించడంతో కుంటుపడిన గ్రామాభివృద్ధిపై ఇక్కడ పోరాటం చేస్తున్న ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ ప్రతినిధులు తమ ఆవేదనను అమెరికాలోనూ వినిపించనున్నారు. ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్‌) ఆధ్వర్యంలో ఈనెల 26 నుంచి 28 వరకు న్యూజెర్సీ నగరంలో జాతీయ తెలుగు సంబరాల్లో భాగంగా ‘మన గ్రామం-మన బాధ్యత’ అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నారు. సదస్సులో పాల్గొనాలని జాతీయ తెలుగు సంబరాల కన్వీనర్‌ శ్రీధర్‌ అప్పసాని ఆహ్వానించారని ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా నిర్వీర్యం చేస్తోంది? ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుతో సర్పంచులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తదితర విషయాలను సదస్సులో వివరిస్తామని ఆయన చెప్పారు. ఏపీ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీముత్యాలరావు, ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్‌రెడ్డి, శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి అనెపు రామకృష్ణనాయుడు, విశాఖ జిల్లా కార్యదర్శి వానపల్లి ముత్యాలరావు, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు చుక్కా ధనుంజయ్‌ యాదవ్‌, విశాఖ జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు దాడి ఎరుకునాయుడు, చింతకాయల ముత్యాలు, తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడు శింగంశెట్టి సుబ్బరామయ్య, అనంతపురం జిల్లా నాయకుడు డేగల కృష్ణమూర్తి, తెలంగాణ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ గౌరవాధ్యక్షుడు పి.నరేంద్ర, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి, కరీంనగర్‌ జిల్లా ఉపాధ్యక్షుడు పి.అశోక్‌రావు జాతీయ తెలుగు సంబరాల్లో పాల్గొంటారని రాజేంద్రప్రసాద్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని