BATA: అట్టహాసంగా ‘బాటా’ స్వర్ణోత్సవాలు!

అమెరికాలో బే ఏరియా తెలుగు అసోసియేష‌న్(BATA) ఏర్పడి 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా ‘డైమండ్‌ జూబ్లీ’ వేడుక‌లను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ స్వర్ణోత్సవాల్లో.. ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్‌, శాన్‌ఫ్రాన్సిస్కోలో భారత కాన్సుల్‌ జనరల్‌ డాక్టర్‌ టీవీ నాగేంద్ర ప్రసాద్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

Published : 30 Oct 2022 22:37 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: అమెరికాలో బే ఏరియా తెలుగు అసోసియేష‌న్(BATA) ఏర్పడి 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా ‘డైమండ్‌ జూబ్లీ’ వేడుక‌లను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇక్కడి శాంతా క్లారా క‌న్వెన్షన్‌ సెంట‌ర్‌లో ఏర్పాటు చేసిన ఈ స్వర్ణోత్సవాల్లో.. ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్‌, శాన్‌ఫ్రాన్సిస్కోలో భారత కాన్సుల్‌ జనరల్‌ డాక్టర్‌ టీవీ నాగేంద్ర ప్రసాద్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రముఖ వైద్యులు, దాత డాక్టర్‌ ల‌కిరెడ్డి హ‌నిమిరెడ్డికి `దాతృత్వ సింధు`, జ‌య‌రాం కోమ‌టికి `ప్రవాస బంధు` బిరుదులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి అమెరికాతోపాటు భార‌త్ నుంచీ భారీ సంఖ్యలో అతిథులు హాజ‌ర‌య్యారు.

తమన్‌ లైవ్‌ ఆర్కెస్ట్రా.. జబర్దస్త్‌ స్కిట్లు..

ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. కూచిపూడి నృత్య ప్రదర్శనలు, జానపద కళలు, అష్టావధానం, పౌరాణిక నాటకాలు, బోనాలు, కోలాటం, వీణ కచేరి, ఫ్యాన్సీ డ్రెస్‌ పోటీలు, కథాచర్చలు వంటి కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. ‘సాహితీ బాట’ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ రచయిత వేమూరి వెంకటేశ్వరరావుకు ‘సాహితీ జీవన సాఫల్య పురస్కారా’న్ని అందజేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్‌ఎస్‌ తమన్‌ ఆధ్వర్యంలో డ్రమ్మర్‌ శివమణి తదితరుల లైవ్‌ ఆర్కెస్ట్రా మైమరిపించేలా చేసింది. ఆటో రాంప్రసాద్‌, బుల్లెట్ భాస్కర్‌ టీం ప్రదర్శించిన జబర్దస్త్‌ స్కిట్స్ ప్రేక్షకులకు కిత‌కిత‌లు పెట్టాయి. మ‌హిళా సంఘం ఆధ్వర్యంలో ‘రైజ్ ఆఫ్ ఉమెన్‌.. యాజ్ దే ఫిట్‌’ అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ప్రముఖ యాంక‌ర్, నటి అన‌సూయ పాల్గొన్నారు.

‘బాటా’ 50 ఏళ్ల పండగను విజయవంతం చేయడంపై అసోసియేషన్‌ అధ్యక్షుడు హరినాథ్ చికోటి వాలంటీర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యక్షుడు కొండ్ల కొమరగిరి, స్టీరింగ్, నామినేటెడ్‌, యూత్‌ కమిటీ సభ్యులు, కల్చరల్ డైరెక్టర్స్, ‘బాటా’ స‌ల‌హా బోర్డు సభ్యులు జ‌య‌రాం కోమ‌టి, విజ‌య ఆసూరి, వీరు వుప్పాల‌, ప్రసాద్‌ మంగిన‌, క‌ర‌ణ్ వెలిగేటి, ర‌మేష్ కొండా, క‌ళ్యాణ్ కట్టమూరి తదితరులు ఉన్నారు. స్థానిక మేయర్ రిచ్ ట్రాన్, ప్రజాప్రతినిధులు, అధికారులూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ సభ్యులు రో ఖన్నా, ఎరిక్ స్వాల్వెల్, ‘తానా’ కార్యదర్శి స‌తీష్ వేమూరి అభినంద‌నలు తెలిపారు. ప్రముఖ ర‌చ‌యిత‌, రేడియో వ్యాఖ్యత కిరణ్‌ ప్రభ, డా.కె.గీతామాధవి, డా.మేడసాని మోహన్, పాలడుగు శ్రీచరణ్, మృత్యుంజయుడు, 'బాటా' పాత, ప్రస్తుత సభ్యులు హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని