జనసేన ఆవిర్భావ వేడుకల వేళ.. డల్లాస్‌లో జనసేన, తెదేపా, భాజపా ఆత్మీయ సమావేశం

డల్లాస్‌లో జనసేన ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు జనసేన నేతలతో పాటు తెదేపా, భాజపా క్యాడర్‌కు చెందిన పలువురు హాజరయ్యారు.

Published : 15 Mar 2024 18:12 IST

అమెరికా: డల్లాస్‌లో జనసేన ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు జనసేన నేతలతో పాటు తెదేపా, భాజపా క్యాడర్‌కు చెందిన పలువురు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ సంక్షేమ, అభివృద్ధిని మెరుగుపరిచేందుకు వైకాపా సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా కలిసి కూటమిగా ఏర్పాటైన విషయం తెలిసిందే. 2024 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఈ మూడు పార్టీలూ కలిసి బరిలో దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన సమావేశంలో పలువురు ఎన్నారైలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఈ కీలక ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా తమ సహాయసహకారాలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ఏపీలో జగన్‌ పాలనలో గత ఐదేళ్లుగా రైతులు, భవన నిర్మాణ కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఏపీలో రౌడీల పాలన సాగుతోందని.. రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందని.. కోలుకోవాలంటే ఎంతో సమయం పడుతుందని తెలిపారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగావకాశాల్లేవని, ఉద్యోగులకు సైతం జీతాలు ఇచ్చేందుకు ప్రస్తుత ప్రభుత్వం సిద్ధంగా లేదని విమర్శించారు. 

జనసేన, తెదేపా నేతలు బొలిశెట్టి శ్రీనివాస్ (జనసేన), పంతం నానాజీ (జనసేన), ఆరిమిల్లి రాధాకృష్ణ(తెదేపా), జ్యోతుల నెహ్రూ(తెదేపా) ఈ సమావేశానికి జూమ్ వేదికగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. గత ఏడాది నుంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఓటు చీలిపోకూడదని ఒకే నినాదాన్ని చెబుతూ కూటమి ఏర్పాటులో కీలకపాత్ర పోషించారన్నారు. అలాగే, ఈ మూడు పార్టీల పొత్తు ఆవశ్యకతను ఎన్నారైలకు వివరించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ కూటమిని దీర్ఘకాలం పాటు కొనసాగుతుందని తెలిపారు. జగన్ హయాంలో రాష్ట్రం అనేక సమస్యలతో సతమతమవుతోందని, అధికార పార్టీకి వ్యతిరేకంగా జనం ఉన్నారన్నారు. డబ్బులు ఇచ్చినా వైకాపాకు ఓటేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని చెప్పారు. ఈసారి వైకాపాకు కేంద్రం, భారాసల నుంచి ఎలాంటి మద్దతు ఉండదన్నారు. వైకాపా ప్రభుత్వం ఎక్సైజ్‌ ద్వారా డబ్బు దోచుకుందని, ఎన్నికల సమయంలో ఖర్చు చేస్తారని నాయకులు వివరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను జగన్‌ అమలుచేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులంతా వైకాపాకు వ్యతిరేకంగా ఉన్నారని జగన్‌ కోసం వాలంటీర్లు మాత్రమే పనిచేస్తారని తెలిపారు. 

తమ మధ్య ఎలాంటి విబేధాలు ఉన్నా ఈ కీలక సమయంలో ఒకరికొకరు మద్దతు ఇవ్వాలని, కూటమి పార్టీల మధ్య 100శాతం ఓటు బదిలీ జరగాలని ఎన్నారైలు విజ్ఞప్తి చేశారు. పవన్‌ కల్యాణ్‌ నిస్వార్థ సేవల్ని ప్రశంసించారు. సీట్ల రాజీ కోసం తనను తాను తగ్గించుకున్నారని, కూటమి ఏర్పాటులో ఆయన కీలకపాత్ర పోషించారన్నారు.  జనసేన కార్యకర్తలు, నాయకులు బూత్ స్థాయిలో బలోపేతం కావాలని, ఎన్నికల సమయంలో సరైన ప్రచారం చేయాలని సూచించారు. తాము కూడా ఇక్కడినుంచి ప్రజలను ప్రభావితం చేస్తామని, కూటమి నేతలు, క్యాడర్‌కు అవసరమైన సాయం అందిస్తామని ఎన్నారైలు పేర్కొన్నారు.  కులమతాలకతీతంగా తాము కూటమి అభ్యర్థికి మద్దతు ఇస్తామని హామీ ఇవ్వడంతో పాటు వారి గెలుపునకు మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తామని తెలిపారు. 

ఈ కార్యక్రమానికి దర్శికి చెందిన జనసేన నేత ఎన్నారై వెంకట్‌ హాలు, విందు ఏర్పాటుచేయగా.. ఆయనకు ఎమ్మెల్యే టికెట్‌ రావాలని పలువురు ఆకాంక్షించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వెంకట్ కేకు కట్‌ చేశారు. ఈసందర్భంగగా పలువురు మద్దతుదారులు జనసేన, తెదేపా, భాజపా కూటమికి అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు అందరినీ సమన్వయం చేయడంలో డల్లాస్ బాబి, సురేష్ లింగినేని, శ్రీరామ్ మత్తి , కిశోరె అనిచెట్టి, జనసేన డల్లాస్ నేతల బృందం ప్రత్యేక శ్రద్ధ చూపించింది. సుగుణ్ చాగర్లమూడి, కేసీ చేకూరి, లోకేష్ కొణిదెల, చింతమనేని సుధీర్, చలసాని కిషోర్ తదితరులు ఈ కార్యక్రమంలో తెదేపా నుంచి పాల్గొని ప్రసంగించారు. అలాగే, భాజపా నుంచి ప్రవల్లిక హాజరై వాలంటీర్‌ వ్యవస్థలో అవకతవకలపై ప్రస్తావించారు. సజిత తిరుమలశెట్టి యాంకరింగ్ ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన అందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని