వైభవంగా సిలికానాంధ్ర మనబడి స్నాతకోత్సవం

ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్‌ పిటాస్‌ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో డా.లక్కిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో..

Published : 11 Jul 2022 22:25 IST

మిల్‌ పిటాస్‌: ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్‌ పిటాస్‌ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో డా.లక్కిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో ఆదివారం మధ్యాహ్నం సిలికానాంధ్ర మనబడి స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌ అధ్యక్షతన పండుగలా జరిగిన స్నాతకోత్సవానికి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. గత 8 ఏళ్లుగా పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో మనబడి పిల్లలకు జూనియర్‌, సీనియర్‌ సర్టిఫికెట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 2021-22 విద్యాసంవత్సరానికి 1,689 మంది విద్యార్థులు జూనియర్‌  సర్టిఫికెట్‌, 1102 మంది విద్యార్థులకు సీనియర్‌ సర్టిఫికెట్‌ పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షల్లో 97.8 శాతం ఉత్తీర్ణతతో జూనియర్ సర్టిఫికెట్ విద్యార్థులు, 97.7 శాతం ఉత్తీర్ణతతో సీనియర్ సర్టిఫికెట్ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

శోభాయాత్రగా తరలివచ్చిన విద్యార్థులు..

తెలుగు భాషాజ్యోతిని పట్టుకొని వందలాది మంది విద్యార్థులు శోభాయాత్రగా  వేదికపై తరలిరావడంతో సభ ప్రారంభమైంది. ఈ సందర్భంగా మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ.. అమెరికాలో అధికసంఖ్యలో మాట్లాడే మొదటి 20 భాషల్లో తెలుగు ఉండటం, వేగంగా అభివృద్ధి చెందుతున్న భాషగా రూపుదిద్దుకోవడం ఆనందంగా ఉందన్నారు. గత 15 ఏళ్లుగా విదేశాల్లో పుట్టి పెరిగిన పిల్లలకు ప్రణాళికాబద్ధంగా తెలుగు భాషను నేర్పుతూ WASC (అమెరికా సంస్థ)  గుర్తింపుపొందిన ఏకైక విద్యాసంస్థ సిలికానాంధ్ర మనబడి మాత్రమేనని కులపతి చమర్తి రాజు సభికులకు గుర్తు చేశారు. సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ.. ఈ విజయం వెనుక ఉన్న 2500 మంది భాషా సైనికుల స్వచ్ఛంద సేవను, అమెరికాలో పుట్టిన పిల్లలకు మన సంస్కృతీ సంప్రదాయాలతో పాటు తెలుగు భాషనూ నేర్పిస్తున్న పిల్లల తల్లిదండ్రులను అభినందించారు.


 

ప్రత్యేక ఆకర్షణగా శ్రీకృష్ణ రాయబారం పద్యనాటకం

ప్రముఖ రంగస్థల కళాకారుడు గుమ్మడి గోపాలకృష్ణ దర్శకత్వంలో మనబడి విద్యార్థులు ప్రదర్శించిన శ్రీకృష్ణ రాయబారం పద్యనాటకం స్నాతకోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీకృష్ణ పాత్రలో సంజన తొడుపునూరి, దుర్యోధనుడి పాత్రలో కాట్రెడ్డి శ్రియ నటన, వారు రాగయుక్తంగా పాడిన పద్యాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ సందర్భంగా గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ... సిలికానాంధ్ర సంస్థతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మనబడి పిల్లలతో అమెరికా నలుమూలలా తన దర్శకత్వంలో ప్రదర్శిస్తున్న పద్యనాటకాలతో.. రాబోయే తరంలో పద్యనాటకం అమెరికాలోనైనా కొనసాగుతుందన్న నమ్మకం కలుగుతోందన్నారు.

మనబడి స్నాతకోత్సవానికి గంటి శ్రీదేవి, రాధా శాస్త్రి సమన్వయకర్తలుగా వ్యవహరించారు. సిలికానాంధ్ర కార్యకర్తలు కొండిపర్తి దిలీప్‌, కూచిభొట్ల శాంతి, కందుల సాయి, సంగరాజ్‌ దిలీప్‌, కోట్ని శ్రీరాం, తనారి గిరి, కస్తూరి ఫణిమాధవ్‌ కార్యక్రమం విజయవంతం చేసేందుకు కృషి చేశారు. 2022-23 మనబడి విద్యా సంవత్సరం సెప్టెంబర్ 10 నుంచి మొదలవుతుందని కులపతి చమర్తి రాజు తెలిపారు. రిజిస్ట్రేషన్లు https://manabadi.siliconandhra.orgలో మొదలయ్యాయని, తల్లిదండ్రులు వెంటనే తమ పిల్లల పేర్లు  నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ మనబడి చేస్తున్న భాషా యజ్ఞం గురించి తెలియజేయాలని, వారిని కూడా మనబడిలో చేరమని ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని