Nara Lokesh: ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్‌

Published : 06 Apr 2024 14:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: 2024 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో కీలకమైనవని, ప్రవాసాంధ్రులు బాధ్యతగా తీసుకొని తెలుగుదేశం పార్టీ గెలుపు అవసరాన్ని ప్రజలకు తెలియజేయాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్‌ అన్నారు. తాజాగా ప్రవాస తెలుగువారితో ఆయన జూమ్ కాల్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా అనేక విషయాలను చర్చించారు. పలువురు ఎన్నారైలు ఇచ్చిన ఫీడ్ బ్యాక్‌ను తీసుకొని వారికి కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు.

‘‘ఎన్నికల సమయంలో ఎన్నారైలు అందరూ భారతదేశం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలి. 2019 ఎన్నికల తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఉపయోగపడే ఒక పనీ జగన్ చేయలేదు. అభివృద్ధి లేని పాలన ఈ ఐదేళ్లలో అందరూ చూశారు. రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఆయన పాలన ఉంది. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా ఆంధ్రా ప్రజలకు ఒక గుర్తింపు ఉండేది. బటన్ నొక్కడం ఒక్కటే ముఖ్యమంత్రి బాధ్యత కాదు, అభివృద్ధి కూడా చేయాలి. విద్య, వైద్యం, ఉపాధి కల్పన అన్నింట్లోనూ ఏపీ వెనుకబడి ఉంది. పక్క రాష్ట్రం నుంచి రావడానికి కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేవు. విద్యుత్ కోతల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పరిశ్రమలు రాలేదు. ప్రభుత్వం చేసిన అప్పులు ప్రజలకు భారంగా మారుతున్నాయి’’

‘‘గత 5 సంవత్సరాల పరిపాలన ఎంతో విధ్వంసకరంగా ఉంది. చేయని తప్పుకి చంద్రబాబునాయుడుగారిని 53 రోజులు జైలులో బంధించారు. పార్టీ పిలుపునిచ్చిన ప్రతిసారి ఎన్నారైలు స్పందించి, అండగా నిలిచారు. ఇన్‌ఫ్లూయెన్సర్స్‌తో చర్చించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఎవరి నియోజకవర్గంలో వారు బాధ్యతలు తీసుకొని విధులను నిర్వహించాలి. రాబోయే 40 రోజులు పార్టీకి ఎంతో కీలకం. ఎన్నారైల కోసం గతంలో APNRT స్థాపించి దాని ద్వారా ఎన్నో రకాల సేవలను, ఆస్తి వివాదాల పరిష్కారం, ఫ్యామిలీ కేర్, తితిదే దర్శనం టికెట్లు వంటి ఎన్నో సేవలు విజయవంతంగా అందించాం. తెదేపా అధికారంలోకి వచ్చాక మరిన్ని ఉపయోగపడే కార్యక్రమాలను చేపడతాం’ అని లోకేష్‌ హామీ ఇచ్చారు. ఎన్నారై తెదేపా అధ్యక్షుడు డా.రవి వేమూరుతో పాటు దాదాపు వెయ్యి మంది వరకు ఈ జూమ్‌ కాల్‌లో పాల్గొన్నారు. గల్ఫ్ ఎన్నారై తెదేపా అధ్యక్షుడు రావి రాధాకృష్ణ ఈ జూమ్ కాల్‌కు సమన్వయకర్తగా వ్యవహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని