NTR: జర్మనీలో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు

ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలను జర్మనీలో ఘనంగా నిర్వహించారు. ఫ్రాంక్ఫర్ట్‌లో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున తెలుగు ప్రజలు పాల్గొన్నారు.

Updated : 23 May 2023 15:41 IST

ఫ్రాంక్ఫర్ట్‌: జర్మనీలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన తెలుగు ప్రవాస భారతీయులు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఫ్రాంక్‌ఫర్ట్‌ (Frankfurt) నగరంలో ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు, మినీ మహానాడు జయప్రదంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జర్మనీలోని వివిధ రాష్ట్రాల నుంచి పురుషులతోసహా మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుక ద్వారా ఎన్టీఆర్ గొప్పతనాన్ని, అయన తెలుగు జాతికి చేసిన సేవలను, తెలుగు సినిమా పరిశ్రమలో అయన అధిరోహించిన ఉన్నత స్థానాలను గుర్తు చేసుకున్నారు.

ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎక్కడున్నా.. వాళ్ల ఆత్మాభిమానం ఎన్టీఆర్‌తో ముడిపడి ఉంటుందని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమానికి తెదేపా నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, చింతమనేని ప్రభాకర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ స్థాపించిన తెదేపా విధేయతకు మారుపేరనీ, ఉన్నత ఆశయాలతో స్థాపించిన పార్టీ అని వేడుకకు హాజరైన వాళ్లను ఉద్దేశించి మాట్లాడారు. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఎన్నారై తెదేపా చేసిన సేవకార్యక్రమాలను నేతలు కొనియాడారు. వేడుకకు హాజరైన తెలుగు వాళ్లకు చక్కటి భోజనం ఏర్పాటు చేశారు. తెలుగుదేశం జర్మనీ అధ్యక్షుడు పవన్ కుర్రా చొరవతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వచ్చే ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రావడానికి తమవంతు సహకారం ఉంటుందని ఈ వేడుకకు హాజరైన ఆహ్వానితుల చేత ప్రతిజ్ఞ చేయించారు. మహానాడు కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. గతేడాది ఎన్నారై తెదేపా జర్మనీ విభాగం చేసిన సేవా కార్యక్రమాలను వివరించారు. వారికి అనుబంధంగా విద్యార్థి విభాగం (Student Wing), మహిళా విభాగం (Women Wing) లను ఏర్పాటు చేసుకోవాలని తీర్మానం చేశారు. 

ఈ కార్యక్రమంలో హరిప్రియ చేసిన కూచిపూడి నృత్యం, శాన్వి తన మిత్ర బృందం తో పాడిన తెలుగు పాటలు అందర్నీ అలరించాయి. ఈ వేడుకను విజయవంతంగా  నిర్వహించిన సమన్వయకర్త సుమంత్ కొర్రపాటిని మిగతా కమిటీ సభ్యులైన శివ, నరేష్, వెంకట్, టిట్టు, అనిల్, వంశీ దాసరి, నీలిమ, అఖిల్, సాయిగాపాల్, రాంబాబు, వంశీ ఉండవల్లి, వంశీ నర్రా, మనోజ్, గణేష్, పవన్ తదితరులు అభినందించారు. ఎన్టీఆర్‌ అభిమానులకి కృతజ్ఞలు తెలుపుతూ సభను ముగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని