అడిలైడ్‌లో ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు.. బాలకృష్ణ కుటుంబ సభ్యుల సందడి!

ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌ నగరంలో ఘనంగా జరిగాయి.ఈ వేడుకలకు సినీనటుడు బాలకృష్ణ కుటుంబ సభ్యులు హాజరై సందడి చేశారు.

Published : 31 May 2023 14:52 IST

అడిలైడ్‌: దక్షిణ ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్నారై టీడీపీ సెల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాలకృష్ణ సతీమణి నందమూరి వసుంధర దేవి , చిన్న కుమార్తె తేజస్విని హాజరయ్యారు. వేడుకగా జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగువారు అధిక సంఖ్యలో పాల్గొని ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులర్పించారు. తొలుత అతిథులు జ్యోతి ప్రజ్వలనం చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆ యుగ పురుషుడి శత జయంతిని పురస్కరించుకొని ప్రత్యేకంగా రూపొందించిన మ్యాగజీన్‌ను కమిటీ సభ్యులతో కలిసి తేజస్విని ఆవిష్కరించారు. అలాగే, అందరికీ గుర్తుండేలా ఎన్నారై టీడీపీ విభాగం అడిలైడ్‌ వారు ప్రత్యేకంగా తయారు చేసిన ఆరు గ్రాముల వెండినాణేన్ని వసుంధర దేవి రిలీజ్‌ చేశారు. వినూత్న ఆలోచనతో జయంతి వేడుకలు ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆమె అభినందించారు. 

యువత ఉత్సాహం, సంబరంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో అభిమానులు కోరిక మేరకు వసుంధర దేవి సినీనటుడు బాలకృష్ణకు ఫోన్‌ చేయడంతో కొద్దిసేపు ఆయన వీడియో కాల్‌ ద్వారా అందరినీ ఉద్దేశించి ప్రసంగించారు. స్థానికంగా ఉన్న తెలుగువారు అధిక సంఖ్యలో పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇదే ఉత్సాహంతో అందరూ ఐకమత్యంతో ఉంటూ ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరాన్ని ఎన్నారైలకు గుర్తు చేశారు. ఈ వేడుక సందర్బంగా నిర్వహించిన పలు సంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో అతిథులను వెండి నాణేలతో కూడిన జ్ఞాపిక, శాలువాలతో సత్కరించారు. 

ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలకు ప్రత్యేక అలంకరణ ఏర్పాట్లు , ఎన్టీఆర్ జీవిత ముఖ్య విశేషాలతో ఏర్పాటు చేసిన గ్యాలరీ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. అన్ని కమిటీల సభ్యులు, వాలంటీర్స్ సమష్టిగా కృషిచేయడం వల్లే నగరంలో ఎన్నడూ లేనంత వైభవంగా ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలను నిర్వహించినట్టు తెదేపా దక్షిణ ఆస్ట్రేలియా కమిటీ అధ్యక్షుడు నవీన్‌ నేపవల్లి తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని