Rajadhani Files: ఖతార్‌లో ‘రాజధాని ఫైల్స్’ సినిమాకి విశేష స్పందన.. అమరావతిపై చర్చ

 ఖతార్‌ రాజధాని దోహాలో ‘ రాజధాని ఫైల్స్‌’ సినిమాకి విశేష స్పందన లభించింది. తెలుగు ప్రజలు తమ కుటుంబ సభ్యులతో వీక్షించేందుకు పోటీపడ్డారు.

Updated : 17 Feb 2024 23:45 IST

దోహా: ఖతార్‌ రాజధాని దోహాలో ‘రాజధాని ఫైల్స్‌’ సినిమాకి విశేష స్పందన లభించింది. తెలుగు ప్రజలు తమ కుటుంబ సభ్యులతో వీక్షించేందుకు పోటీపడ్డారు. డైరెక్టర్‌ భానుశంకర్‌ సోదరి కూడా ప్రేక్షకులతో కలిసి ఈ చిత్రాన్ని చూశారు. ఈ సందర్భంగా పలువురు తమ స్పందనను తెలియజేశారు. రాష్ట్ర రాజధానిలో జరుగుతున్న అరాచకాలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారని అన్నారు. రాజధాని రైతులు తమ భూములను రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగం చేశారే తప్ప.. లాభాపేక్షతో కాదనే సత్యాన్ని ఇందులో తెలియజెప్పారన్నారు. రాజధాని సమస్య 29 గ్రామాలు, 28 వేల మంది రైతులది కాదనీ, భావితరాలదనే సత్యాన్ని ఇందులో స్పష్టం చేశారని కొనియాడారు.

అమరావతి రైతులు చేపట్టిన ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు’ పాదయాత్ర తమ స్వగ్రామం మీదుగా సాగిన సమయంలో వారికి ఒక పూట భోజనం పెట్టే అదృష్టం దక్కిందని కొందరు జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అరాచక ప్రభుత్వాన్ని సాగనంపాలని నినదించారు. దాదాపు 90శాతానికి పైగా పూర్తయిన భవనాలను అమరావతిపై ద్వేషంతో నిరుపయోగంగా మార్చారని, వాటిని పూర్తి చేసి ఉద్యోగులకు ఇచ్చి ఉంటే.. నెలకు రూ.78 కోట్ల చొప్పున ఏడాదికి సీఆర్‌డీఏకి దాదాపు రూ.1000 కోట్ల హెచ్‌ఆర్‌ఏ వచ్చి ఉండేదని మండిపడ్డారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి తమ ఓటు హక్కు ద్వారా ప్రజలు అడ్డుకట్టవేయాలని ఆకాంక్షించారు.

రాజధాని రైతులు అనుభవిస్తున్న బాధలను సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారని,  రైతులకు నైతిక మద్దతిస్తూ, తమ వంతు బాధ్యతగా నిర్మాత కంఠంనేని రవిశంకర్‌,  డైరెక్టర్‌ భాను ఇంతటి సాయం చేయడం అభినందనీయమని తెలుగు ప్రజలు కొనియాడారు. వినోద్‌కుమార్, వాణీవిశ్వనాథ్ తమ నటనతో ఆకట్టుకున్నారని అన్నారు. తెలుగు ప్రజలంతా ఈ సినిమాను తప్పనిసరిగా వీక్షించాలని ప్రపంచవ్యాప్తంగా ఆదరించి నిర్మాత, డైరెక్టర్లకు మద్దతివ్వాలని పిలుపునిచ్చారు.

‘రాజ‌ధాని ఫైల్స్‌’ సినిమా రివ్యూ కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని