TANA: కొవిడ్‌ సేవలకు గుర్తింపు.. ‘తానా’కు రెడ్‌క్రాస్‌ సేవా పతకాలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం కీర్తి కిరీటంలో మరో కలికితురాయి. కొవిడ్‌ రెండో వేవ్‌ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాధితులకు అందించిన విశేష సేవలకు గుర్తింపుగా తానాతోపాటు సంఘం కార్యవర్గ సభ్యురాలు శిరీష తూనుగుంట్లకు రెడ్‌క్రాస్‌ విశిష్ట సేవా పతకం వరించింది.

Published : 30 Oct 2022 21:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (TANA) కీర్తి కిరీటంలో మరో కలికితురాయి. కొవిడ్‌ రెండో వేవ్‌ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాధితులకు అందించిన విశేష సేవలకు గుర్తింపుగా తానాతోపాటు సంఘం కార్యవర్గ సభ్యురాలు శిరీష తూనుగుంట్లకు రెడ్‌క్రాస్‌ విశిష్ట సేవా పతకం వరించింది. విజయవాడ వేదికగా నిర్వహించిన పురస్కార ప్రదానోత్సవంలో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈ పతకాలు అందజేశారు. తానా తరఫున సంఘం టీమ్స్‌ స్క్వేర్‌ ఛైర్‌ కాకర్ల సురేశ్‌, శిరీష తూనుగుంట్ల తరఫున ఆమె తండ్రి మిట్టపల్లి పాండురంగారావు ఈ పతకాన్ని స్వీకరించారు.

కొవిడ్‌ రెండో వేవ్‌ సమయంలో బాధితులకు ఆస్పత్రి పడకలు, ఆక్సిజన్‌ సిలిండర్లు‌, మందుల లభ్యత తదితర వివరాల అందజేతలో ‘తానా’ విశేష కృషి చేసింది. సంఘం ఆనాటి అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి ఆధ్వర్యంలో కార్యవర్గం మొత్తం రంగంలోకి దిగింది. ఈ సేవా కార్యక్రమ నిర్వహణలో కార్యవర్గ సభ్యురాలు శిరీష తూనుగుంట్ల కీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు 24 గంటలు అందుబాటులో ఉండే హెల్ప్‌లైన్‌నూ ఏర్పాటు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో రెడ్‌క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీధర్‌రెడ్డి సమన్వయంతో 40 వేల మెడికల్ కిట్లు, 650 ఆక్సిజన్ కాన్సంట్రేటర్‌లు, 120 వెంటిలేటర్స్ పంపిణీ చేసింది. నిత్యవసర సరకులు, మాస్కులు, ఇతరత్రా సామగ్రి అందజేసి ఎంతో మందిని ఆదుకుంది. ఈ సేవలకు గుర్తింపుగా రెడ్‌క్రాస్‌ సొసైటీ.. తానా సంస్థకు, శిరీష తూనుగుంట్లకు విశిష్ట సేవా గోల్డ్ మెడల్స్ ప్రకటించింది. విదేశాల్లో ఉంటూ.. మాతృదేశంలో ప్రజలకు ఆపద, అవసరాల్లో మేమున్నామని ముందుకొచ్చిన సేవామూర్తులకు దక్కిన గుర్తింపు ఇదని పలువురు ప్రశంసిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని