వాషింగ్టన్ డీసీలో ఘనంగా తానా (నరేన్ వర్గం) విజయోత్సవ సభ

తానా ఎన్నికల్లో డా.నరేన్‌ కొడాలి వర్గం నుంచి గెలిచిన అభ్యర్థులంతా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం శనివారం (మార్చి 23న) సాయంత్రం వాషింగ్టన్ డీసీలో విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించారు.

Published : 25 Mar 2024 20:21 IST

వాషింగ్టన్‌ డీసీ: ఈ ఏడాది జనవరిలో జరిగిన తానా ఎన్నికల్లో డా.నరేన్ కొడాలి వర్గం దాదాపు అన్ని పదవుల్లో విజయం సాధించిన తర్వాత పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలపై కొన్ని ఫిర్యాదులు రావడంతో తలెత్తిన సందిగ్ధతకు ఇటీవల బోర్డు సమావేశంలో తెరపడింది. ఈనేపథ్యంలో ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులంతా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం శనివారం (మార్చి 23న) సాయంత్రం వాషింగ్టన్ డీసీలో విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సభకు తానా సభ్యులు, శ్రేయోభిలాషులతో పాటు దాదాపు 600మంది తరలివచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. అన్ని నగరాల నుంచి డా.నరేన్‌ కొడాలి టీమ్‌లో గెలిచిన వారందరినీ వేదిక పైకి పిలిచి తనకు మద్దతుగా పనిచేసిన అందరికీ ఆయన ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సభలో డా.నరేన్‌ కొడాలి మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా తనకు అధ్యక్ష పదవి అందనీయకుండా ప్రత్యర్థి వర్గం పలు ఇబ్బందులకు గురిచేసిందని, కోర్టు చుట్టూ తిప్పిందని, వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. కేవలం తానా సంస్థపై ఉన్న అభిమానంతోనే తాను, తన కుటుంబం నిలబడగలిగినట్లు తెలిపారు. ఇకపై ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తానా ప్రతిష్టను మరింత పెంచేలా తెలుగు కమ్యూనిటీకి సేవ చేస్తామని ఈసందర్భంగా వెల్లడించారు.

ఈ విజయోత్సవ సభకు శ్రీనివాస్ లావు, రవి పొట్లూరి, రాజ కసుకుర్తి, వెంకట్ కోగంటి, సునీల్ పంత్ర, లోకేష్ కొణిదెల, నాగా పంచుమర్తి, టాగోర్ మలినేని, సతీష్ కొమ్మన, ఎందురి శ్రీనివాస్, రామ్ అల్లు , వెంకట్ అడుసుమిల్లి, కేపీ సొంపల్లి, నీలిమ మన్నే, సతీష్ చింత, వెంకట్ సింగు, సురేష్ పాటిబండ్లతో పాటు పలువురు విజేతలు విచ్చేశారు. అలాగే, తానా పెద్దలు జయరామ్ కోమటి, సతీష్ వేమన, శ్రీనివాస్ గోగినేని, ప్రసాద్ నల్లూరి తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని అనిల్ ఉప్పలపాటి, సాయి బొల్లినేని, సతీష్ చింత, జనార్దన్ నిమ్మలపూడి, త్రిలోక్ కంతేటి, సుధీర్ కొమ్మి, రాజేష్ కాసరనేనితో పాటు వర్జీనియా నరేన్ కొడాలి మిత్ర బృందం సమన్వయంతో ఘనంగా నిర్వహించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని