Tanmayi Art Studio: తన్మయి ఆర్ట్‌ స్టూడియో ఆధ్వర్యంలో మెగా కూచిపూడి ప్రదర్శన

తన్మయి ఆర్ట్‌ స్టూడియో వ్యవస్థాపకురాలు ప్రీతి తాతంబొట్ల ఆధ్వర్యంలో దుబాయ్‌లో కూచిపూడి నృత్య ప్రదర్శన ఘనంగా నిర్వహించారు.

Published : 21 May 2023 22:17 IST

దుబాయ్‌: తన్మయి ఆర్ట్‌ స్టూడియో వ్యవస్థాపకురాలు ప్రీతి తాతంబొట్ల ఆధ్వర్యంలో దుబాయ్‌లోని హైట్స్‌ అకాడమీలో మెగా కూచిపూడి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి,  కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అమన్‌ పురి, ఎస్‌ఆర్‌ఆర్‌ సంస్థల వ్యవస్థాపకులు శ్రీరామ్‌ తోట ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శ్రావణి తెన్నేటి ప్రదర్శనతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఆ తర్వాత తన్మయి ఆర్ట్ స్టూడియలో శిక్షణ తీసుకుంటున్న జూనియర్లు, సీనియర్లు వేదికపై నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి దివంగత శోభానాయుడు రూపొందించిన ‘‘కల్యాణ శ్రీనివాసం’’ నృత్య ప్రదర్శనతో కళాకారులు అలరించారు.

దాదాపు 90 నిమిషాలపాటు సాగిన ఈ ప్రదర్శన ఆహూతులను కట్టిపడేసింది. అక్కడున్నవారంతా తన్మయత్వం చెందారు. అన్నమాచార్యుల కీర్తనలకు చేసిన నృత్యాలతో తిరుమలలో ఉన్నామా? అన్నంతలా భక్తిపారవశ్యంతో ఉప్పొంగారు. ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో అకాడమీ ప్రాంగణమంతా మార్మోగిపోయింది. ఇంతటి చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రీతి తాతంబొట్లను అక్కడున్న వారంతా చప్పట్లతో అభినందించారు. ప్రీతి తాతంబొట్లకు నృత్యమంటే మక్కువ. 9 ఏళ్ల వయస్సులోనే కళారంగంలోకి అడుపెట్టి..  16 ఏళ్లకు పైగా పద్మశ్రీ డా.శోభా నాయుడు వద్దే శిక్షణ పొందారు. కార్యక్రమం అనంతరం ముఖ్య అతిథులుగా వచ్చిన వారిని నిర్వాహకులు సత్కరించారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రీతి తాతంబొట్లను అతిథులు అభినందించారు. కళ పట్ల ఆమెకున్న నిబద్ధత, గౌరవం, ఎనలేని ప్రేమాభిమానాల వల్లే కార్యక్రమం ఇంత గ్రాండ్‌ సక్సెస్‌ అయిందంటూ కొనియాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని