డెట్రాయిట్‌లో అట్టహాసంగా మహిళా దినోత్సవం

గ్లోబల్‌ తెలంగాణ సంఘం డెట్రాయిట్‌ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. 

Published : 07 Mar 2024 17:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్లోబల్ తెలంగాణ సంఘం (GTA) డెట్రాయిట్ మహిళా విభాగం నిర్వహించిన లేడీస్ నైట్ అట్టహాసంగా జరిగింది. శనివారం ఇక్కడి ఫార్మింగ్టన్ మేనర్‌లో నిర్వహించిన కార్యక్రమానికి వివిధ వృత్తుల్లో ఉన్న సుమారు 350 మంది భారతీయ మహిళలు పాల్గొన్నారు. 

తల్లులుగా, భార్యలుగా, ఉద్యోగులుగా, ఇంజినీర్లుగా, డాక్టర్లుగా, వ్యాపారవేత్తలుగా దైనందిన జీవితాలలోని తమ విజయాలను ఈసందర్భంగా వారు ప్రస్తావించుకుంటూ ఆస్వాదించారు. ఇటీవల జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రెండో తరం భారతీయ సంతతికి చెందిన జిల్లా జడ్జి జస్టిస్ షాలినాకుమార్ ప్రసంగిస్తూ అమెరికాకు, ప్రపంచానికి వివిధ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో భారతీయ మహిళలు అందించిన ఎనలేని సేవలను, కనబరిచిన విశేష ప్రతిభా పాటవాలను కొనియాడారు. 

అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు రెట్టించిన ఉత్సాహంతో పాటుపడాలని, తమ కార్యక్రమాలను చిత్తశుద్ధితో కొనసాగించాలని చెప్పారు. “ అన్ని రంగాలలో రాణించే స్ర్తీల విజయాలను మనం పండగలా జరుపుకుంటున్నా, లింగ సమానత్వం, మహిళలకు సమానత్వాన్ని సాధించే ప్రయాణం చాలా దూరం ఉందనే విషయం మరిచిపోకూడదు. మహిళలు తమ అవకాశాలను పొందకుండా ఉన్న అడ్డంకులను సమర్థంగా ఎదుర్కొని వాటిని తొలగించాలి” అని జస్టిస్‌ షాలినా కుమార్‌ చెప్పారు. 

ఈ వేడుకలకి ముఖ్య వక్తగా పాల్గొన్న ప్రొఫెసర్ పద్మజ నందిగామ మాట్లాడుతూ మహిళలు కుటుంబం కోసం రోజూ నిర్వహించే సేవలు వెల కట్టలేనివని అన్నారు. నిర్వాహకులు ఈ సందర్భంగా ఫ్యాషన్ షోను నిర్వహించారు. అత్యుత్తమంగా అలంకరించుకుని వచ్చిన మహిళలకు అవార్డులు అందించారు. ఘుమఘుమలాడే భారతీయ వంటకాలు అతిథులకు వడ్డించారు. 

శ్రీకాంత్ సందుగు పాటలు ఆహూతులను అలరించాయి. యాంకర్‌ సాహిత్య వింజమూరి అందరినీ తనదైన శైలిలో పొందికైన మాటల మాలలతో ఆకట్టుకుంది. విశిష్టమైన కార్యక్రమానికి ప్రణాళిక రచించి ఆచరణలో పెట్టడంలో కీలకపాత్ర వహించిన కమిటీ సభ్యులు సుష్మ పడుకోనె, స్వప్న చింతపల్లి, సుమ కల్వల, దీప్తి వెనుకదాసుల, దీప్తి లచ్చిరెడ్డిగారి, హర్షిని బీరపు, అర్పిత భూమిరెడ్డి, కళ్యాణి ఆత్మకూరు, శిరీషా రెడ్డి, డాక్టర్ అమిత కాకులవరం తదితరులను జీటీఏ డెట్రాయిట్ కార్యవర్గం అభినందించింది.

అమెరికావ్యాప్తంగా ఉన్న తమ సంఘం వనితా బృందాలు రాబోయే వారాల్లో మహిళా దినోత్సవ కార్యక్రమాలను నిర్వహించడానికి కృషి చేస్తున్నాయని సుష్మా పదుకొనే, సుమ కల్వల తెలిపారు. డెట్రాయిట్ వేడుకలను దిగ్విజయంగా నిర్వహించడానికి సహకరించినందుకు జీటీఏ నాయకత్వానికి, ఛైర్మన్ విశ్వేశ్వర్ రెడ్డి కలువల, అధ్యక్షుడు ప్రవీణ్ కేసిరెడ్డి,  ఎగ్జిక్యూటివ్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని