కాంగ్రెస్‌ భేటీ నేడు.. ఆత్మశోధనకు కాదా?

దేశ ప్రజలు కాంగ్రెస్‌ను ప్రత్యామ్నాయంగా భావించడం లేదంటూ ఆ పార్టీ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ బహిరంగ వ్యాఖ్యలు చేసినా కూడా.. హస్తం పార్టీ ఆత్మపరిశీలనకు సిద్ధపడినట్లు కన్పించడం లేదు. అధినేత్రి సోనియాగాంధీ ప్రత్యేక అడ్వైజరీ

Published : 17 Nov 2020 13:11 IST

ఎజెండాలో బిహార్‌ లేదంటోన్న పార్టీ వర్గాలు 

దిల్లీ: దేశ ప్రజలు కాంగ్రెస్‌ను ప్రత్యామ్నాయంగా భావించడం లేదంటూ ఆ పార్టీ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ బహిరంగ వ్యాఖ్యలు చేసినా కూడా ఆత్మపరిశీలనకు సిద్ధపడినట్లు కనిపించడం లేదు. అధినేత్రి సోనియాగాంధీ ప్రత్యేక అడ్వైజరీ కమిటీ మంళవారం భేటీ కానుంది. సాయంత్రం 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సమావేశం జరగనుంది. సిబల్‌ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ఇందులో బిహార్‌ ఫలితాల అంశం ఎజెండాలో లేదని, సాధారణ పాలనా సమస్యలపై చర్చించేందుకే సమావేశం కానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించడం గమనార్హం. 

పార్టీ అధినాయకత్వ వైఖరిని తప్పుబడుతూ ఆగస్టులో 23 మంది కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీంతో పార్టీ సంస్థాగత, కార్యనిర్వాహక అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునేందుకు అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ అడ్వైజరీ కమిటీనీ ఏర్పాటు చేశారు. కేసీ వేణుగోపాల్‌, ఏకే ఆంటోనీ, అంబికా సోనీ, ముకుల్‌ వాస్నిక్‌, రణదీప్‌ సుర్జేవాలా ఈ కమిటీ సభ్యులుగా ఉన్నారు. అయితే, ఈ భేటీకి సోనియాగాంధీ దూరంగా ఉండటంతో బిహార్‌ ఫలితాలపై ఎలాంటి చర్చ జరిగే అవకాశం లేదని పార్టీ వర్గాల సమాచారం. 

బిహార్‌లో ఘోర పరాజయం నేపథ్యంలో కాంగ్రెస్‌లో మరోసారి అసంతృప్త గళాలు వినిపించాయి. పార్టీ ఆత్మశోధన చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ బహిరంగంగానే అధిష్ఠానం వైఖరిపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కే చెందిన‌ మరో నేత కార్తీ చిదంబరం కూడా సిబల్‌ వ్యాఖ్యలకు మద్దతు పలికారు. కాగా.. సిబల్‌ వ్యాఖ్యలను రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ఖండించారు. పార్టీ అంతర్గత విషయాలపై నేతలు మీడియాకు ఎక్కడం ఆక్షేపణీయమని దుయ్యబట్టారు. 

ఇదీ చదవండి..  

ప్రజలు కాంగ్రెస్‌ను విశ్వసించడం లేదు 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని