Bihar: ‘మహాఘట్‌ బంధన్‌’... ఆందోళనలో మిత్ర పక్షాలు!

జేడీయూ, ఆర్జేడీ మధ్య విభాదాలు తలెత్తితే పరిష్కరించుకోవడానికి ‘ సమన్వయ కమిటీ’ని ఏర్పాటు చేయాలని మిత్ర పక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ బయటకు రావడానికి సమన్వయ లేమే కారణమని ఆరోపిస్తున్నాయి.

Published : 06 Oct 2022 01:31 IST

పాట్నా: ఎన్డీయే కూటమితో తెగదెంపులు చేసుకున్న జేడీయూ అధ్యక్షుడు నితీశ్‌ కుమార్‌, ఆర్జేడీ, మిత్ర పక్షాలతో కలసి బిహార్‌లో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే రెండు నెలలైనా నిండక ముందే కూటమిలో అలజడి మొదలైంది. వచ్చే ఏడాది నాటికి సీఎం స్థానంలో ఆర్జేడీ కీలక నేత, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ వస్తారని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్‌ జగదానంద్‌ సింగ్‌ చెప్పడం అలజడి మొదలైందనడానికి ఊతమిస్తోంది. మరోవైపు ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న కారణంగా అదే పార్టీకి చెందిన వ్యవసాయశాఖ మంత్రి సుధాకర్‌ సింగ్‌ను ప్రభుత్వం ఆ పదవి నుంచి తొలగించింది. ఆయన సింగ్‌ తనయుడు కావడం గమనార్హం.

ఈ నేపథ్యంలో తేజస్వీ యాదవ్‌ స్పందించారు. తాను సీఎం కావడానికి తొందరేమీ లేదని, దీనిపై పార్టీ నాయకులెవరూ ప్రకటనలు చేయొద్దని ఆదేశించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర చీఫ్‌ జగదానంద్‌ సర్య్కులర్‌ జారీ చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. అసలు సమస్య అక్కడే మొదలైంది. తాజా పరిస్థితులపై మిత్రపక్షాలైన సీపీఐఎంఎల్‌ (ఎల్‌),సీపీఐ తదితర చిన్నపార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సంక్షీర్ణ ప్రభుత్వంలోని రెండు ప్రధాన పార్టీలైన జేడీయూ, ఆర్జేడీ మధ్య విభేదాల పరిష్కారానికి ‘ సమన్వయ కమిటీ’ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. గతంలో ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ విడిపోవడానికి సమన్వయలోపమే కారణమని ఆరోపిస్తున్నాయి. మరోసారి ఇలా జరగకుండా ఉండాలంటే ‘ సమన్వయ కమిటీ’ ఏర్పాటు ఆనివార్యమని మిత్రపక్షాలు అంటున్నాయి.

సుధాకర్‌ సింగ్‌ రాజీనామా అనంతరం డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ను కలిసినట్లు సీపీఐఎం(ఎల్‌) పార్టీ నేత మహబూబ్‌ ఆలం పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ‘సమన్వయ కమిటీ’ ఏర్పాటు ఆవశ్యతను ఆయనకు వివరించానన్నారు. సుధాకర్‌ సింగ్‌ రాజీనామా లాంటి ఘటనలు మినహా ప్రస్తుతం ప్రభుత్వం సాఫీగానే సాగుతున్నప్పటికీ విభేద రహితంగా ప్రభుత్వాన్ని కొనసాగించాలని చెప్పానన్నారు. దీనిపై తేజస్వీ కూడా సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. ఒకవేళ సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తే ఎవరెవరిని సభ్యులుగా నియమించాలన్నదానిపై ఓ జాబితా తయారు చేయమని చెప్పారన్నారు. మిగతా పార్టీ నేతలతోనూ చర్చించి వీలైనంత తొందరగా దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ఆలం చెప్పారు.

మహాఘట్‌ బంధన్‌లో ప్రస్తుతం జేడీయూ, ఆర్జేడీ, సీపీఐఎం(ఎల్‌), కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఐ (ఎం),మాజీ ముఖ్యమంత్రి జితిన్‌ రామ్‌ మాంఝీ నేతృత్వంలోని హెచ్‌ఏఎం మిత్రపక్షాలుగా ఉన్నాయి. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గానూ ఆర్జేడీ, జేడీయూకు కలిపి 124 మంది ఎమ్మెల్యేలున్నారు. ఒకవేళ ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తినట్లయితే ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. అలాంటి పరిస్థితులు ఎదురవ్వకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ‘సమన్వయ కమిటీని’ ఏర్పాటు చేయాలని మిత్రపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిత్రపక్షాలతో కలిసి సమన్వయకమిటీని ఏర్పాటు చేస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని