Bandi Sanjay: ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి ఎందుకొచ్చింది?: బండి సంజయ్‌

మధ్యవర్తిత్వం లేకుండా అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించిన ఘనత ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వానిదని తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.

Updated : 02 Jun 2022 16:01 IST

హైదరాబాద్‌: మధ్యవర్తిత్వం లేకుండా అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించిన ఘనత ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వానిదని తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. మోదీ ప్రభుత్వం 8 ఏళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ఈనెల 14 వరకు భాజపా రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మోదీ ఎనిమిదేళ్ల పాలనపై లఘు చిత్రమాలికను భాజపా రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ హయాంలో ఎన్నో పెద్ద కుంభకోణాలు బయటపడ్డాయని.. ఎనిమిదేళ్ల మోదీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదన్నారు.

‘‘కరోనా సమయంలో దేశాన్ని మోదీ కాపాడారు. లాక్‌డౌన్‌ విధించి ప్రజలు ఇబ్బంది పడకుండా ఆక్సిజన్‌ సిలిండర్లు, వ్యాక్సిన్‌ అందించారు. ఉపాధి కోల్పోయిన వాళ్లకోసం గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన కింద ఉచితంగా కేంద్రం బియ్యం పంపిణీ చేసింది. పేదల కోసం దేశవ్యాప్తంగా 4కోట్ల ఇళ్లను కేంద్రం ప్రభుత్వం నిర్మించింది. రెండు పడకగదుల ఇళ్ల పేరుతో పేదలను కేసీఆర్‌ వంచించారు. ఇప్పటి వరకు కనీసం 10వేల ఇల్లు కూడా తెరాస ప్రభుత్వం ఇవ్వలేదు. తెలంగాణలో భాజపా అధికారంలోకి వచ్చాక ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద లక్షల ఇళ్లు నిర్మిస్తాం. ఫసల్‌ బీమా పథకాన్ని రాష్ట్రంలో నీరుగార్చారు. తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేంద్రం పెద్దపీట వేసింది. ఆర్టికల్‌ 370 రద్దు చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిది. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కలను సాకారం చేసింది. కాశీని మోదీ అద్భుతంగా అభివృద్ధి చేశారు.

ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకొచ్చిందో కేసీఆర్‌ సమాధానం చెప్పాలి. తెలంగాణను శ్రీలంకలా తయారు చేసే ప్రమాదం ఏర్పడింది. శ్రీలంకలో కుటుంబ పాలన తరహాలో ఇక్కడా కేసీఆర్‌ కుటుంబం పాలిస్తోంది. పేరు ప్రఖ్యాతల కోసం సీఎం పాకులాడుతున్నారు. వెంచర్ల పేరుతో భూములను రాష్ట్ర ప్రభుత్వం గుంజుకుంటోంది’’ అని బండి సంజయ్‌ ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని