Perni Nani: అర్హత లేనివాళ్లు ప్రశ్నించినంత మాత్రాన వ్యతిరేకత కాదు: పేర్ని నాని

మహానాడు నిర్వహించే అర్హత చంద్రబాబు కుటుంబానికి లేదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.

Updated : 28 May 2022 18:08 IST

గన్నవరం: మహానాడు నిర్వహించే అర్హత తెదేపా అధినేత చంద్రబాబు కుటుంబానికి లేదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మంత్రుల బస్సు యాత్ర మహానాడుకు పోటీకాదని తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారం 2024లోనే వైకాపా ఎన్నికలకు వెళ్తుందని స్పష్టం చేశారు. మంత్రులు చేపట్టిన బస్సు యాత్ర కృష్ణా జిల్లా గన్నవరం చేరుకుంది. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన పేర్నినాని మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్‌ ఎన్నికల ముందు చేపట్టిన పాదయాత్రకు ప్రజలు ఎలా వచ్చేవారో బస్సుయాత్ర సందర్భంగా అలాగే వస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో సామాజిక న్యాయం మాటల్లోనే ఉండేదని.. చేతల్లో కనబడేది కాదని పేర్కొన్నారు.

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే సామాజిక న్యాయం కార్యరూపం దాల్చిందని చెప్పారు. గడిచిన ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో జగన్‌ గెలిచారని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు 60శాతానికి పైగా ఓట్లు వచ్చాయని చెప్పారు. మిగతా 40మంది వ్యతిరేకించారని.. అలాంటి వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు అర్హత లేకపోయినా ఫలానా పథకం రాలేదని ప్రశ్నిస్తున్నారు. అలా ప్రశ్నించినంత మాత్రాన అది వ్యతిరేకత కాదన్నారు. ఆర్థిక స్థితిగతుల వల్ల ఉద్యోగులు అడిగినంత పీఆర్సీని ఇవ్వలేకపోయినట్లు చెప్పారు. ఆశించిన మేర ఇవ్వలేకపోతున్నట్లు జగన్‌ నిజాయతీగా చెప్పారని పేర్నినాని తెలిపారు..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని