ఉప ప్రణాళిక అమలులో వైకాపా ప్రభుత్వ వైఖరి మోసపూరితం

ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలులో వైకాపా ప్రభుత్వ వైఖరి మోసపూరితంగా ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు.

Updated : 30 Jan 2023 06:19 IST

జనసేన నేత నాదెండ్ల మనోహర్‌

ఈనాడు, అమరావతి: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలులో వైకాపా ప్రభుత్వ వైఖరి మోసపూరితంగా ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. నిధులను దారి మళ్లించడమే కాకుండా అడ్డగోలుగా బుకాయిస్తోందని విమర్శించారు. కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు లేనిపోని నిబంధనలు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తోందని చెప్పారు. గుంటూరు నగర అధ్యక్షుడు నేరెళ్ల సురేష్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర రెల్లి సమితి ప్రతినిధులు ఆదివారం మనోహర్‌ను కలిశారు. ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నా తమకు ఉద్యోగ భద్రత లేదని, సమాన పనికి సమాన వేతనం అమలు కావడం లేదని, ఉప ప్రణాళిక నిధులు తమకు చేరడం లేదని వివరించారు. కుల ధ్రువీకరణ పత్రాల కోసం వెళ్తే మైగ్రేషన్‌ సర్టిఫికెట్లు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెల్లి కార్మికుల సమస్యలను పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్తామని ఆయనతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని మనోహర్‌ వారికి హామీ ఇచ్చారు.

* ఆంధ్రప్రదేశ్‌ కృష్ణ బలిజ సంఘం నాయకులు ఆదివారం నాదెండ్ల మనోహర్‌ను కలిసి తమ సమస్యలను విన్నవించారు. తమ వర్గం బలంగా ఉన్న చోట రాజకీయ ప్రాధాన్యమివ్వాలని కోరారు. అత్యంత వెనకబడిన కులమైన తమను బీసీ డీ నుంచి బీసీ ఏలోకి మార్చేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సమస్యలపై పవన్‌ కల్యాణ్‌తో చర్చిస్తానని మనోహర్‌ వారికి హామీ ఇచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు