BRS: రైతు వాదంతోనే జయం
మనం ఎవరినీ భిక్ష అడుక్కోవాల్సిన అవసరం లేదు. అందుకే బాగా ఆలోచించి ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదాన్ని తీసుకున్నాం.. ఎవరికో ఓట్లు ఎందుకు వేయాలి? మనమే ఎన్నికల్లో గెలుద్దాం.
జాతి, మతవాదాలను పక్కన పెట్టాలి
అన్నదాతలు ఏకమై పిడికిలి బిగిస్తేనే న్యాయం
కర్షకులు మృతిచెందినా నోరెత్తని ప్రధాని
ఎన్నికల వేళ తీపి కబుర్లతో క్షమాపణ
గోదావరి, కృష్ణా పుట్టిన చోట నీటి కొరతా?
మహారాష్ట్రలోని ప్రతి జిల్లాలో గులాబీ జెండా
కంధార్ లోహ బహిరంగసభలో భారాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్
కంధార్-లోహ నుంచి ‘ఈనాడు’ ప్రతినిధి
మనం ఎవరినీ భిక్ష అడుక్కోవాల్సిన అవసరం లేదు. అందుకే బాగా ఆలోచించి ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదాన్ని తీసుకున్నాం.. ఎవరికో ఓట్లు ఎందుకు వేయాలి? మనమే ఎన్నికల్లో గెలుద్దాం. మనలో ఆ దమ్ము లేదా? ఈ విషయం అర్థమైతే చాలు.. అన్నీ పరిష్కారమవుతాయి. అసంఘటితంగా ఉన్నంతవరకు సమస్యలు అట్లాగే ఉంటాయి. రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉంటాయి. అందరం ఏకమవుదాం. కొట్లాడి సాధించుకుందాం
కేసీఆర్
‘ఫసల్ బీమా యోజన మీలో ఎవరికైనా వస్తోందా? బ్యాంకుల చుట్టూ తిరగడమే గానీ డబ్బులు పడవు. వీటన్నింటికీ పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది. జాతి, మతవాదాలను పక్కనబెట్టండి. రైతువాదాన్ని భుజానికెత్తుకోండి. కర్షకులంతా ఏకమై పిడికిలి బిగిస్తే న్యాయం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో మీ నుంచి నాయకుడిని ఎన్నుకుంటే మార్పు వస్తుంది. ఇన్నేళ్లుగా పాలించిన ప్రభుత్వాలు మనల్ని తేలిగ్గా తీసుకుంటున్నాయి. కిసాన్ వాదాన్ని గట్టిగా వినిపిస్తే సమస్యలు వాటంతటవే పరిష్కారమవుతాయి. విజయం తథ్యమవుతుంది’ అని భారాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రైతులకు పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కంధార్-లోహ పట్టణంలో ఆదివారం నిర్వహించిన భారాస బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ‘మనం జీవితాంతం పోరాడాల్సిందేనా? నుదుటిపై ఇదే రాసి పెట్టి ఉందా? మరి మనం గెలిపించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎక్కడ నిద్రపోతున్నారు? రైతులు వందల సంఖ్యలో మృతిచెందినా.. ప్రధానమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్ ఎన్నికలు వచ్చేసరికి తీపి కబుర్లు చెబుతూ రైతులను క్షమాపణ కోరారు. అబద్ధాల మాటలు విని జనం మళ్లీ ఓటేశారు. క్షమాపణ చెప్పగానే సమస్య తీరిపోయిందా? మన తలరాత ఏమీ మారలేదు. మనం సంఘటితం కానంతవరకు ఇలాంటి కల్లబొల్లి కబుర్లు చెప్పి బోల్తా కొట్టిస్తారు’ అని కేసీఆర్ దుయ్యబట్టారు.
తెలంగాణ పథకాలు అమలు చేయాలి
‘గతంలో నేను నాందేడ్‌కు వచ్చినప్పుడు.. ఇక్కడి ప్రస్తుత ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్.. ‘చంద్రశేఖర్‌రావుకు ఇక్కడేం పని.. తెలంగాణలో పని చూసుకో’ అని అన్నారు. నేను భారత పౌరుడిని. ప్రతి రాష్ట్రంలోనూ అడుగుపెడతా. తెలంగాణలో ప్రతి రైతుకు ఎకరాకు రూ.10 వేల చొప్పున రైతుబంధు ఇస్తున్నాం. పంటలకు నీళ్లు, 24 గంటల నాణ్యమైన కరెంటు అందుతోంది. చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇస్తున్నాం. పండించిన ప్రతి పంటనూ మా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. దళితబంధు పథకం కింద ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఉచిత ఆర్థిక సాయం చేస్తున్నాం. ఇవన్నీ ఇక్కడ కూడా అమలు చేస్తామని ఫడణవీస్ హామీ ఇస్తే.. నేను మహారాష్ట్రకు రావడం మానేస్తాను. అప్పటివరకు జబర్దస్త్‌గా వస్తూనే ఉంటా. రైతులతో కలిసి పోరాడుతూనే ఉంటా.
కాంగ్రెస్, భాజపాలతో ఒరిగిందేమీ లేదు
దేశాన్ని అత్యధిక కాలం కాంగ్రెస్, భాజపా ప్రభుత్వాలు పాలించినా ప్రజల బతుకులు మారలేదు. రెండు పార్టీల పాలనలో ఏమన్నా తేడా కనిపించిందా? ఆయా పార్టీల్లో, వాళ్ల నేతల్లో మార్పు వచ్చింది గానీ.. ప్రజల అభివృద్ధిలో ఏం తేడా కనిపించలేదు. నేను చెప్పేది నిజమో.. అబద్ధమో గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఊరికి, బస్తీకి వెళ్లాక మీ సహచరులతో చర్చించండి. దీనికి పరిష్కారం మన చేతుల్లోనే ఉంది.
నిలబడి కొట్లాడితే ప్రతి ఎకరాకు నీళ్లు
గోదావరి, కృష్ణా నదులు మహారాష్ట్రలోనే పుట్టాయి. అయినా ఇక్కడ తాగు, సాగునీరు ఎందుకు అందట్లేదు? కరెంటు ఎందుకు ఇవ్వడం లేదు? నాతో పాటు నిలబడి కొట్లాడండి.. ప్రతి ఎకరా భూమికి నీళ్లు వస్తాయి. ఇది నా హామీ. దేశంలో సరిపడా సహజ వనరులున్నాయి. 361 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. దీంతో దేశమంతటికీ 24 గంటలూ అత్యంత నాణ్యమైన విద్యుత్తును సులభంగా ఇవ్వవచ్చు. ఆకాశంలో చంద్రుడిని, నక్షత్రాలను కావాలని అడుగుతున్నామా? నాందేడ్‌కు నేను ఒక్కసారి వచ్చి వెళ్లేసరికి.. మహారాష్ట్రలో రైతులకు బడ్జెట్‌లో నిధులు పెంచారు. ఇంతకుముందు ఎందుకివ్వలేదు? ఉల్లి, చెరకు ధరల కోసం ఏటా పోరాటం చేయాల్సిందేనా? ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.6 వేలు మాత్రమే ఇస్తోంది. రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
ప్రతి గ్రామంలో మీ శక్తి చూపించండి
మహారాష్ట్రలోనూ భారాస పార్టీని రిజిస్టర్ చేయించాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం. ప్రతి జిల్లా పరిషత్‌లోనూ గులాబీ జెండా ఎగరాలి. ప్రతి గ్రామంలో మీ శక్తిని చూపించండి. ఇక్కడి పాలకులకు ఒక్కసారి ఝలక్ ఇవ్వండి. మీ సమస్యలను పరిష్కరించి చూపిస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు దిగి రావో చూద్దాం. నాందేడ్‌లో విమానం దిగగానే.. ఇక్కడి నుంచి ఆఖరి విమానం సాయంత్రం 5.30 గంటలకే బయలుదేరుతుందని స్థానిక అధికారులు చెప్పారు. ఎందుకని అడిగితే సాయంత్రం 5.30 గంటలకు విమానాశ్రయాన్ని మూసివేస్తామని చెప్పారు. 24 గంటలూ నడవాల్సిన నాందేడ్ విమానాశ్రయాన్ని కేవలం పగటి పూట మాత్రమే నిర్వహిస్తున్నారు. అంటే దేశం అభివృద్ధిలో ముందుకు పోతోందా? వెనక్కి వెళ్తోందా? జై తెలంగాణ.. జై మహారాష్ట్ర.. జై భారత్!’ అని కేసీఆర్ ప్రసంగాన్ని ముగించారు. ఈ సభలో ఎంపీలు జోగినపల్లి సంతోష్, దీవకొండ దామోదర్‌రావు, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, షకీల్, బాల్క సుమన్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భారాస కిసాన్‌సెల్ అధ్యక్షుడు గుర్నామ్‌సింగ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ, మరాఠా నేతలు, హరియాణా రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ రాకముందు రోజూ రైతుల ఆత్మహత్యలు జరిగేవి. చనిపోవద్దు.. నీళ్లు, విద్యుత్ అందిస్తాం.. కొద్దిరోజులు ఓపిక పట్టండని నేను విజ్ఞప్తి చేశాను. ఇప్పుడు విద్యుత్, నీళ్లు అన్నీ లభ్యమవుతున్నాయి. రైతులు సంతోషంగా ఉన్నారు. తెలంగాణలో పరిష్కారమైన సమస్యలు.. ఈ రాష్ట్రంలో ఎందుకు కావు? అనేకమంది ఉద్యమకారుల జన్మభూమి మహారాష్ట్రలో త్వరలో విప్లవం వస్తుంది. ఇక్కడ సంపదకు కొదవ లేదు. ప్రజలకు ఇవ్వాలన్న మనసు పాలకులకు లేకపోవడమే విచారకరం. సమస్యల పరిష్కారానికి ఇక్కడ 10, 15 ఏళ్లు అవసరం లేదు. ఇంకా త్వరగా పరిష్కారమవుతాయి. అందుకే మనసు పెట్టి ఆలోచించండి
భారాస అధినేత కేసీఆర్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Odisha Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటన.. రంగంలోకి సీబీఐ
-
India News
Manipur: మణిపుర్లో మళ్లీ చెలరేగిన హింస.. ఇంటర్నెట్పై బ్యాన్ కొనసాగింపు
-
General News
APSRTC: స్టీరింగ్ విరగడంతో ఆర్టీసీ బస్సు బోల్తా.. 19 మందికి గాయాలు
-
India News
Brij Bhushan Singh: రెజ్లర్ల ఆందోళన.. బ్రిజ్ భూషణ్ ఇంటికి దిల్లీ పోలీసులు
-
General News
Polavaranm-CM Jagan: పోలవరంలో సీఎం జగన్ పర్యటన
-
World News
Ukraine: ఉక్రెయిన్‌పై భారీ దాడి.. నోవా కఖోవ్కా డ్యామ్ పేల్చివేత..!