విపక్షాల నిరసనలతో పార్లమెంటు వాయిదా

పార్లమెంటు ఉభయ సభలు మంగళవారం సయితం సజావుగా సాగలేదు. పారిశ్రామికవేత్త అదానీ వ్యవహారం, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అనర్హత అంశాలపై విపక్ష సభ్యులు మరోసారి గళమెత్తారు.

Published : 29 Mar 2023 05:29 IST

దిల్లీ: పార్లమెంటు ఉభయ సభలు మంగళవారం సయితం సజావుగా సాగలేదు. పారిశ్రామికవేత్త అదానీ వ్యవహారం, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అనర్హత అంశాలపై విపక్ష సభ్యులు మరోసారి గళమెత్తారు. ప్రభుత్వతీరుకు నిరసనగా నల్లవస్త్రాలు ధరించి వచ్చిన పలువురు సభ్యులు పెద్దఎత్తున నినాదాలిచ్చారు. లోక్‌సభ తొలుత సమావేశమైనప్పుడు విపక్షాల డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ప్రశ్నోత్తరాల సమయం తుడిచిపెట్టుకుపోయింది. కాంగ్రెస్‌ సభ్యులు కొన్ని పత్రాలను చించి, స్పీకర్‌ స్థానం వైపు విసిరారు. నల్లని కండువాలను కొందరు విసరగా, వాటిని మార్షల్స్‌ అడ్డుకున్నారు. సభాపతి స్థానంలో ఉన్న పి.వి.మిథున్‌రెడ్డి.. సభ్యుల తీరును తప్పుబట్టారు. ఒకేఒక్క నిమిషంలోనే మధ్యాహ్నానికి సభ వాయిదా పడింది. రెండోసారి సమావేశమైన తర్వాత కూడా.. అదానీపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణ కోసం విపక్షం డిమాండ్‌ చేసింది. సభాపతి స్థానం వద్దకు సభ్యులు చేరుకుని బైఠాయించారు. గందరగోళ పరిస్థితుల మధ్యే కొన్ని నివేదికలను, పత్రాలను ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ‘సేవ్‌ డెమోక్రసీ’ (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి) అని రాసిన నినాద ఫలకాలు ప్రదర్శిస్తూ సభ్యులు నిరసన కొనసాగించడంతో ఆ సమయంలో సభాపతి స్థానంలో ఉన్న రమాదేవి.. సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యసభలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఉదయం ఒకసారి వాయిదాపడి, మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి సమావేశమైంది. ఏయే బిల్లులను చర్చకు చేపట్టబోయేదీ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ చెబుతుండగా విపక్షాలు అడ్డుపడి నిరసనలు తెలిపాయి. దీంతో సభ వాయిదా పడింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు