జూన్‌ మొదటి వారంలో హైదరాబాద్‌కు సోనియా!

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ జూన్‌ మొదటి వారంలో హైదరాబాద్‌ రానున్నారు. సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలోని పదెకరాల స్థలంలో పీసీసీ ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన  ‘గాంధీ ఐడియాలజీ సెంటర్‌’ భవన నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేస్తారు.

Updated : 12 May 2023 06:09 IST

బోయిన్‌పల్లిలో గాంధీ ఐడియాలజీ కేంద్రానికి శంకుస్థాపన
రాహుల్‌ గాంధీ, ఖర్గేలకూ ఆహ్వానం
పీసీసీ నాయకత్వం సన్నాహాలు

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ జూన్‌ మొదటి వారంలో హైదరాబాద్‌ రానున్నారు. సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలోని పదెకరాల స్థలంలో పీసీసీ ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన  ‘గాంధీ ఐడియాలజీ సెంటర్‌’ భవన నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేస్తారు. ఇందుకు తెలంగాణ కాంగ్రెస్‌ నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి సోనియాతోపాటు రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర జాతీయ స్థాయి నాయకులను కూడా ఆహ్వానిస్తామని పీసీసీ ముఖ్య నాయకుడొకరు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. జూన్‌ 1న లేదా మొదటి వారంలో ఈ కార్యక్రమం ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లి శివారులో సుమారు పదెకరాల స్థలం కేటాయించారు. అందులో గాంధీ ఐడియాలజీ సెంటర్‌ నిర్మాణానికి అనుమతి కోరుతూ పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి కంటోన్మెంట్‌ బోర్డుకు గతంలో దరఖాస్తు చేశారు. బుధవారం జరిగిన కంటోన్మెంట్‌ బోర్డు పాలకమండలి సమావేశంలో జీ ప్లస్‌ 2 భవనానికి అనుమతి ఇస్తున్నట్లు బోర్డు సీఈవో మధుకర్‌ నాయక్‌ ప్రకటించారు. అనుమతి లభించిన నేపథ్యంలో వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని పీసీసీ భావిస్తోంది.

ఈ భవనాన్ని పార్టీ జాతీయస్థాయి అవసరాలకు ఉపయోగపడేలా పీసీసీ డిజైన్‌ చేస్తోంది. గాంధీ భావజాలాన్ని తెలిపే లైబ్రరీతోపాటు పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలను వీక్షించేందుకు వీలుగా థియేటర్‌.. గాంధీ కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ వచ్చినప్పుడు విడిది చేసేలా ఏర్పాట్లు.. ఏఐసీసీ అధ్యక్షుడికి ప్రత్యేక ఛాంబర్‌.. పార్టీ రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేలా నిర్మాణం ఉండబోతోందని పార్టీ వర్గాల సమాచారం. జీ ప్లస్‌ 2 అంతస్తులకు కంటోన్మెంట్‌ బోర్డు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఎన్ని చదరపు అడుగుల విస్తీర్ణంలో, ఏయే సౌకర్యాలతో భవనాన్ని నిర్మించాలనే అంశంపై పార్టీలో సమాలోచనలు జరుగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని