మాట మీరొద్దు.. గీత దాటొద్దు.. తెలంగాణ నేతలతో జేపీ నడ్డా

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నేతలంతా కలిసికట్టుగా ముందుకుసాగాలని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారు.

Published : 10 Jul 2023 05:34 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నేతలంతా కలిసికట్టుగా ముందుకుసాగాలని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారు. నాయకులంతా క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ పరస్పర ఆరోపణలతో పార్టీకి నష్టం కలిగించకూడదని, అలాంటివి సహించబోమని స్పష్టం చేశారు. ఇటీవలి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర నేతలను నడ్డా తీవ్రస్థాయిలోనే హెచ్చరించారు. ఆదివారం రాత్రి శంషాబాద్‌లోని నోవాటెల్‌లో రాష్ట్ర భాజపా ముఖ్యనేతలతో నడ్డా సమావేశమయ్యారు. కిషన్‌రెడ్డి, ప్రకాశ్‌ జావడేకర్‌, తరుణ్‌ ఛుగ్‌, సునీల్‌ బన్సల్‌, బండి సంజయ్‌, కె.లక్ష్మణ్‌, ఈటల రాజేందర్‌, డీకే అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సహా ముఖ్యనేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కార్యాచరణను సమష్టిగా అమలు చేయాలని నడ్డా సూచించారు. గతంలో ఎన్నడూ లేనంతగా.. భాజపా అంతర్గత అంశాలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. పార్టీ అగ్రనేతల పర్యటనలు క్రమం తప్పకుండా ఉంటాయని.. అన్ని ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని వీటిని ఏర్పాటు చేయాలని సూచించారు. ఇన్‌ఛార్జులు పూర్తిగా అందుబాటులో ఉంటూ పార్టీ వ్యవహారాలు సజావుగా సాగేలా చూడాలన్నారు.

నడ్డాతో వేర్వేరుగా భేటీలు

పార్టీ పదవుల విషయంలో గత కొన్ని రోజులుగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో జేపీ నడ్డాతో పలువురు ముఖ్యనేతలు ఒక్కొక్కరు విడివిడిగా సమావేశమయ్యారు. ఈటల రాజేందర్‌, ఎంపీ డి.అర్వింద్‌, మాజీ ఎంపీలు జి.వివేక్‌, విజయశాంతి, జాతీయ కార్యవర్గసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సమావేశమై వివిధ అంశాలపై చర్చించినట్లు తెలిసింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యమని, ఇతర అంశాలను పక్కనపెట్టి కలిసికట్టుగా ముందుకు సాగాలని వారందరికీ నడ్డా సూచించినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని