మూడు రాష్ట్రాల్లో ఏం చేద్దాం?

అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మూడు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను ఎంపిక చేయడం భాజపా అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది.

Published : 10 Dec 2023 04:47 IST

తలనొప్పిగా మారిన ముఖ్యమంత్రుల ఎంపిక
జైపుర్‌ నుంచి ప్రకాశ్‌ భండారీ

అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మూడు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను ఎంపిక చేయడం భాజపా అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది. మధ్యప్రదేశ్‌లో అధికారం నిలబెట్టుకోగా రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లను కాంగ్రెస్‌ నుంచి కైవసం చేసుకుంది. ఈ రాష్ట్రాల్లో వసుంధర రాజె, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, రమణ్‌ సింగ్‌ భాజపాకు స్థానికంగా బలమైన నేతలుగా ఉన్నారు. ఇప్పుడు వారిని కాదని కొత్త వారిని ఎంపిక చేయాలనుకున్న భాజపా అగ్ర నాయకత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది. వీరంతా ప్రధాని మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి సమకాలికులుగా ఉన్నారు. దాదాపు రెండు దశాబ్దాలపాటు ఆయా రాష్ట్రాల్లో వారే పెద్ద దిక్కుగా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థులను ఇప్పటికే మోదీ, అమిత్‌ షా ఎంపిక చేశారని, నామమాత్రంగా పరిశీలకులను ఆయా రాష్ట్రాలకు పంపించారనే వాదనా ఉంది. కానీ పేర్లను వెల్లడించడానికి పార్టీ ముందుకు రావడం లేదు.

రాజస్థాన్‌లో వసుంధర రాజె రూపంలో భాజపాకు పెద్ద అడ్డంకి ఎదురవుతోంది. ఇప్పటికే ఆమె ఇంటికి 45 మంది ఎమ్మెల్యేలు వెళ్లి వచ్చారు. తాము మర్యాదపూర్వకంగానే ఆమెను కలిశామని వారు చెబుతున్నా మద్దతు పలికేందుకే వెళ్లారని అంటున్నారు. తమకు 75 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెబుతున్నారు. ఇలా తన బలాన్ని చూపడంద్వారా మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆమె లాబీయింగ్‌ చేస్తున్నారు. పరిశీలకులుగా వచ్చిన రాజ్‌నాథ్‌ సింగ్‌, సరోజ్‌ పాండే, వినోద్‌ తావ్డే ఆదివారం జైపుర్‌లో పార్టీ ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇటు జేపీ నడ్డాను కలిసి వసుంధర రాజె తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. భాజపా అధిష్ఠానం ఆమెకు ఇవ్వాలని అనుకోవడం లేదు. అయితే తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలను చీల్చి కాంగ్రెస్‌ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారేమోనన్న అనుమానం అధిష్ఠానంలో ఉంది. కాంగ్రెస్‌ నేత అశోక్‌ గహ్లోత్‌ కూడా ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లే కనిపిస్తోంది. అప్పుడు లోక్‌సభ ఎన్నికలను వసుంధరతో కలిసి ఎదుర్కోవచ్చన్నది ఆయన ఆలోచన. రాజస్థాన్‌లో భాజపా ఇటువంటి పరిస్థితిని ఎన్నడూ ఎదుర్కోలేదు. వసుంధర రాజెకున్న అసాధారణ బలాన్నీ భాజపా విస్మరించలేని పరిస్థితిలో ఉంది. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ముఖ్యమంత్రిని చేయాలని అధిష్ఠానం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే పరిశీలకుల నివేదిక కోసం వేచి చూస్తోంది. మిగిలిన వారిలో గజేంద్ర సింగ్‌ షెకావత్‌, దియా కుమారి, మహంత్‌ బాలక్‌నాథ్‌ పోటీలో ఉన్నారు. జోధ్‌పుర్‌కు చెందిన వైష్ణవ్‌ మూడు దశాబ్దాల పాటు ఐఏఎస్‌గా ఒడిశాలో సేవలందించారు. రాష్ట్రానికి దూరంగానే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికీ ఆయన వెళ్లలేదు. అయితే బ్రాహ్మణ వర్గానికి చెందిన ఆయనను ముఖ్యమంత్రిని చేయాలని అధిష్ఠానం భావిస్తోందంటున్నారు.

నాపై ఊహాగానాలొద్దు: బాలక్‌నాథ్‌

ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి తన పేరు ప్రచారంలో ఉందనే అంశాన్ని పట్టించుకోవద్దని బాబా బాలక్‌నాథ్‌ స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లో ఎంతో అనుభవం గడించాల్సి ఉందని పేర్కొన్నారు. ‘నాపై మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని పట్టించుకోవద్దు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో నేను చాలా నేర్చుకుంటున్నా’ అని ఆయన శనివారం ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని