మట్టిలో కలిసే వరకు కేసీఆర్‌ వెన్నంటే ఉంటా

‘ముప్పై ఏళ్లు పార్టీని నమ్ముకుని ఆ రోజు తెదేపాకి ఒక నిజాయతీ గల నాయకురాలిగా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేశా.

Published : 06 Apr 2024 05:59 IST

మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్‌

డోర్నకల్‌, న్యూస్‌టుడే: ‘ముప్పై ఏళ్లు పార్టీని నమ్ముకుని ఆ రోజు తెదేపాకి ఒక నిజాయతీ గల నాయకురాలిగా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేశా. ఆ తరువాత కేసీఆర్‌ పిలిచారు.. ఎన్నికల్లో ఓడిపోతే బిడ్డలా ఆదరించి ఎమ్మెల్సీని చేశారు. మంత్రిగా బాధ్యతలు అప్పచెప్పి గుర్తింపునిచ్చారు. ఆయన మూడోసారి సీఎం కావాలనే ఆకాంక్షతో కాళ్లకు చెప్పులు తొడగకుండా పార్టీ అభివృద్ధి కోసం పని చేశా. కేసీఆర్‌ పేరిట పచ్చబొట్టు వేయించుకున్నా. అలాంటి నేను మట్టిలో కలిసిపోయేదాకా కేసీఆర్‌ వెన్నంటే ఉంటా’ అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్‌ భావోద్వేగానికి లోనయ్యారు. డోర్నకల్‌లో శుక్రవారం ఆమె భారాస ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. గురువారం డోర్నకల్‌ పురపాలక సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షుడు, వారి అనుచరులతోపాటు ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు. ఆ పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని సత్యవతిరాథోడ్‌ మాట్లాడుతూ ఎందరో నాయకుల్ని తయారుచేసిన కేసీఆర్‌ ప్రస్తుతం కష్టకాలంలో ఉంటే కొందరు వారి స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌లో చేరారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ గెలిచాక కేసీఆర్‌ చేసిన మంచి పనులను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని, దీనిని బట్టి పార్లమెంటు ఎన్నికల ఫలితాలు భారాసకు అనుకూలంగా ఉంటాయనే సంకేతం అందుతోందని పేర్కొన్నారు. శనివారం నియోజకవర్గ కేంద్రాల్లో రైతుల ఒక రోజు దీక్షని విజయవంతం చేయాలని భారాస నేతలు, కార్యకర్తలను కోరారు. సమావేశంలో మహబూబాబాద్‌ జడ్పీ అధ్యక్షురాలు ఆంగోతు బిందు, మహబూబాబాద్‌ ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ విద్యాసాగర్‌ తదితర నాయకులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని