ఫోన్‌ ట్యాపింగ్‌ మొదటి బాధితుడిని నేనే: ఈటల

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో మొదటి బాధితుడిని తానేనని, తన కుటుంబ సభ్యులు, డ్రైవర్‌, వంట మనుషులు సహా అందరి ఫోన్లు ట్యాప్‌ చేశారని మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు.

Published : 08 Apr 2024 03:39 IST

బోరబండ, న్యూస్‌టుడే: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో మొదటి బాధితుడిని తానేనని, తన కుటుంబ సభ్యులు, డ్రైవర్‌, వంట మనుషులు సహా అందరి ఫోన్లు ట్యాప్‌ చేశారని మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. తెలంగాణ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో అమీర్‌పేటలో ఆదివారం నిర్వహించిన మీట్‌ ద ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన క్యాబినెట్‌లోని 17 మంది మంత్రులనూ నమ్మలేదని, వాళ్ల ఫోన్లు, భార్యాభర్తల సంభాషణలు విన్నారని ఈటల ఆరోపించారు. రాష్ట్రాన్ని కేసీఆర్‌ అప్పుల్లో ముంచారని విమర్శిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. ‘ప్రధాని మోదీని పెద్దన్న అని పిలిచిన రేవంత్‌ ఇప్పుడు ఆయనపైనే విమర్శలు చేస్తున్నారు. రైతు రుణమాఫీ, ఎకరాకు రూ.15 వేలు, కౌలు రైతుకు రూ. 12 వేలు ఇస్తామన్న కాంగ్రెస్‌.. వాటిని అమలు చేయాలి. పొన్నాల లక్ష్మయ్యను విమర్శించిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు కేశవరావును కాంగ్రెస్‌లోకి ఎలా తీసుకున్నారో చెప్పాలి. దళితుడే కాదన్న కడియం శ్రీహరి కుమార్తెకు ఎంపీ టికెట్‌ ఎలా ఇచ్చారు? మల్కాజిగిరికి, ఈటల రాజేందర్‌కు ఏం సంబంధం ఉందని అంటున్న రేవంత్‌కు.. మల్కాజిగిరితో ఏం సంబంధం ఉంది? కేసీఆర్‌ లాగే ఆయన కూడా నాయకులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, వ్యాపారులను కొంటున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నా స్వయంకృతాపరాధమే. తెలంగాణలో భాజపా 12కి పైగా ఎంపీ సీట్లు గెలుస్తుంది’ అని ఈటల అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని