అసెంబ్లీకి రారు.. ప్రచారానికి తిరుగుతున్నారు: కేసీఆర్‌పై మంత్రి కొండా సురేఖ విమర్శ

కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో వెంకట్రామిరెడ్డి కలెక్టర్‌గా ఉన్నప్పుడు  నిబంధనల పేరుతో పేదల ఇళ్లు కూలగొట్టి వాటిని పెద్దలకు అప్పగించి రూ.కోట్లు ఆర్జించారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.

Updated : 11 Apr 2024 09:27 IST

రామచంద్రాపురం రూరల్‌, న్యూస్‌టుడే: కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో వెంకట్రామిరెడ్డి కలెక్టర్‌గా ఉన్నప్పుడు  నిబంధనల పేరుతో పేదల ఇళ్లు కూలగొట్టి వాటిని పెద్దలకు అప్పగించి రూ.కోట్లు ఆర్జించారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. మెదక్‌ భారాస అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయనను ఓడించాలని పిలుపునిచ్చారు. బుధవారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఎన్‌ఎస్‌యూఐ విభాగం సభ్యులతో నిర్వహించిన మెదక్‌ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో కలెక్టర్‌గా ఉన్న వెంకట్రామిరెడ్డి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని కేసీఆర్‌ ఎన్నికల ప్రచారానికి మాత్రం తిరుగుతున్నారని విమర్శించారు. ఆయన సామాన్యుల పనులు పక్కన పెట్టి మేడిగడ్డ, మిషన్‌భగీరథ పథకాల ఫైళ్లపై సంతకాలు పెట్టారన్నారు. తమ సర్కారు అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలపై విమర్శలు చేసే నైతిక హక్కు మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌లకు లేదని పేర్కొన్నారు. పార్టీలో అందరూ కలిసికట్టుగా ఉంటూ ఎంపీ అభ్యర్థి నీలం మధును గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పటాన్‌చెరు ఇన్‌ఛార్జి కాటా శ్రీనివాస్‌గౌడ్‌, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌, కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షురాలు నిర్మల, దుబ్బాక పార్టీ ఇన్‌ఛార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్‌గౌడ్‌, నర్సింహారెడ్డి, వినయ్‌గౌడ్‌, అంతిరెడ్డి తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని