Bandi sanjay: మూసీ ప్రక్షాళన పేరిట సీఎం దగా..

కాలుష్యమయంగా మారిన మూసీనదిని ప్రక్షాళన చేస్తానన్న కేసీఆర్‌ ప్రజలను మోసపుచ్చారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ముఖ్యమంత్రిని విమర్శించారు. ఆ నది నీటితో స్నానం చేయిస్తే

Updated : 06 Aug 2022 03:44 IST

ఆ నది నీళ్లతో స్నానం చేయిస్తే కానీ ఆయనకు దాని ప్రక్షాళన పట్టదేమో
ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్‌ విమర్శలు

భూదాన్‌పోచంపల్లి, బీబీనగర్‌, భువనగిరి, న్యూస్‌టుడే: కాలుష్యమయంగా మారిన మూసీనదిని ప్రక్షాళన చేస్తానన్న కేసీఆర్‌ ప్రజలను మోసపుచ్చారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ముఖ్యమంత్రిని విమర్శించారు. ఆ నది నీటితో స్నానం చేయిస్తే కానీ ఆయన ప్రక్షాణనపై దృష్టిపెట్టడేమోనంటూ ధ్వజమెత్తారు. 2002లో వాజ్‌పేయీ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు రూ.344 కోట్లు కేటాయించగా, రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ.4,000 కోట్లతో మూసీ ప్రక్షాళన చేస్తానని, హుస్సేన్‌సాగర్‌ నీటిని కొబ్బరినీళ్లలా మారుస్తానని మాటిచ్చిన కేసీఆర్‌ నేటి వరకు చేసిందేమీ లేదన్నారు. ఇక్కడి ప్రజల బాధలు వింటుంటే దుఃఖం వస్తోందని, ముఖ్యమంత్రి మాత్రం చలించటం లేదని దుయ్యబట్టారు. సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌, భూదాన్‌పోచంపల్లి మండలాల్లో కొనసాగింది. నది చెంతనే ఉన్న భూదాన్‌పోచంపల్లి మండలం పెద్దరావులపల్లిలో గ్రామస్థులు, మహిళలతో ఆయన రచ్చబండ నిర్వహించారు. మూసీ మురుగు జలాలతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను గ్రామస్థులు ఏకరవు పెట్టారు. పంటలు, పాలు, నీళ్లు, ఆరోగ్యం దెబ్బతింటున్నాయని, పెళ్లికి పిల్లలను ఇవ్వడానికీ జంకుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ.. 300 ఎకరాల ఫాంహౌస్‌కు 200 కిలోమీటర్ల నుంచి నీటిని తెచ్చుకోవడానికి కేసీఆర్‌ రూ.1.30 లక్షల కోట్లు ఖర్చు చేశారని, మూసీ ప్రక్షాళన హామీని మాత్రం విస్మరించారని మండిపడ్డారు. కార్పొరేషన్ల పేరుతో రూ.వేలకోట్ల రుణాలు తీసుకొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని భ్రష్టుపట్టించారని విమర్శించారు. మూసీ ప్రక్షాళనకు ప్రత్యేక బోర్డు ఏర్పాటుచేసి రూ.కోట్ల రుణాలు తెచ్చి ఏంచేశారో కేసీఆర్‌ ప్రజలకు బదులివ్వాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు. బీబీనగర్‌ మండలం భట్టుగూడెంలో విలేకరులతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడుతూ.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తమతో టచ్‌లో ఉన్నారని తాను అనలేదని, అనని మాటలను అన్నట్లు మీడియాలో ప్రచారం చేయొద్దని కోరారు.

దాసోజును భాజపాలోకి ఆహ్వానిస్తున్నాం: సంజయ్‌

కాంగ్రెస్‌ పార్టీకి, ఏఐసీసీ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్‌ భాజపాలో చేరాలని బండి సంజయ్‌ ఆహ్వానించారు. భూదాన్‌ పోచంపల్లి మండలం ముక్తాపూర్‌ సమీపంలో శుక్రవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. మూసీ పరివాహకంలోని ప్రజల దుర్భర పరిస్థితిని తెలియజెప్పేందుకే కొరియర్‌లో మూసీనీళ్ల సీసాను సీఎంకు పంపుతున్నానన్నారు. ఇప్పటికైనా నది ప్రక్షాళనకు ఆయన రూ.4వేల కోట్లు విడుదల చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని