జాతీయోద్యమ స్ఫూర్తికి భాజపా తూట్లు: భట్టి విక్రమార్క

జాతిపిత మహాత్మాగాంధీ చెప్పిన లౌకికవాదాన్ని విస్మరించి మతాల పేరుతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న భాజపా ప్రభుత్వం స్వాతంత్య్ర పోరాట ఉద్యమ స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు.

Published : 12 Aug 2022 06:05 IST

కొణిజర్ల, న్యూస్‌టుడే: జాతిపిత మహాత్మాగాంధీ చెప్పిన లౌకికవాదాన్ని విస్మరించి మతాల పేరుతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న భాజపా ప్రభుత్వం స్వాతంత్య్ర పోరాట ఉద్యమ స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆజాదీకా గౌరవ్‌ యాత్ర గురువారం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల, కొణిజర్ల, పల్లిపాడు వరకు కొనసాగింది. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ..మతోన్మాద శక్తులు దేశాన్ని మతాల పేరుతో చీల్చి రక్తపాతం సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఖాన్‌అబ్దుల్‌ గఫార్‌ఖాన్‌, సయ్యద్‌ ఫజల్‌ హసన్‌ వంటి వారు స్వాతంత్య్ర ఉద్యమంలో యువతను ఉప్పెనలా కదిలించారని గుర్తుచేశారు. మైనార్టీ సోదరుల పోరాటాన్ని మరుగున పరిచి ప్రచార ఆర్భాటాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. తెరాస అధికారం చేపట్టాక ఇప్పటివరకు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారమే ఇవ్వలేదని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్‌, మల్లు నందిని, దొబ్బల సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని