గత ప్రభుత్వాల ఘనత మీదని ఎలా చెప్పుకొంటారు?

తప్పులైతే గత ప్రభుత్వాలపైకి నెట్టేయడం, ఘనత అయితే తమదిగా డబ్బా కొట్టుకోవడం ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి వ్యసనంగా మారిపోయిందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

Published : 13 Aug 2022 07:51 IST

సీఎం జగన్‌పై లోకేశ్‌ ధ్వజం

ఈనాడు, అమరావతి: తప్పులైతే గత ప్రభుత్వాలపైకి నెట్టేయడం, ఘనత అయితే తమదిగా డబ్బా కొట్టుకోవడం ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి వ్యసనంగా మారిపోయిందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. ఉన్నత విద్యపై అఖిల భారత స్థాయిలో జరిగిన సర్వేలో ఏపీ ముందు ఉండటం వైకాపా ప్రభుత్వ ఘనతే అని జగన్‌రెడ్డి సిగ్గు లేకుండా అబద్ధాలాడుతున్నారని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. ‘‘ఆ సర్వే నివేదిక 2018 ఏప్రిల్‌ 1 నుంచి 2019 మార్చి 31 వరకు విద్యార్థుల ఉత్తీర్ణత, విద్యా ప్రమాణాలు ఆధారంగా ఇచ్చింది. ఉన్నత విద్యలో స్థూల ప్రవేశాల నిష్పత్తి జాతీయ స్థాయిలో 3.04 శాతం ఉంటే... ఏపీలో 8.64 శాతం ఉంది. దీనికి కారణం 2000 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీబడికి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే. అఖిల భారత సర్వేలో ఏపీకి మెరుగైన ఫలితాలు రావడంలో జగన్‌రెడ్డి ఘనత సున్నా శాతం కూడా లేదు...’’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.

మాధవ్‌పై కేంద్రం చర్యలు తీసుకోవాలి: పిల్లి మాణిక్యరావు
ఈనాడు డిజిటల్‌, అమరావతి : వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియో వ్యవహారం పార్లమెంట్‌ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉందని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మాధవ్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. చేసిన తప్పునకు సిగ్గుపడాల్సింది పోయి తెదేపా అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌, కొన్ని మీడియా సంస్థలపై అసభ్యకరంగా మాట్లాడటం ఆయన దివాళాకోరుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని