ఎంపీ గోరంట్ల వాహన శ్రేణిని అడ్డుకున్న తెదేపా

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలం చౌళూరులో నిర్వహిస్తున్న స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఎంపీ గోరంట్ల మాధవ్‌ వాహన శ్రేణిని పట్టణంలోని చిన్నమార్కెట్‌ కూడలి వద్ద సోమవారం మధ్యాహ్నం

Updated : 16 Aug 2022 07:03 IST

నిరసన తెలుపుతూ నినాదాలు
పలువురు నాయకుల అరెస్ట్‌

హిందూపురం అర్బన్‌, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలం చౌళూరులో నిర్వహిస్తున్న స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఎంపీ గోరంట్ల మాధవ్‌ వాహన శ్రేణిని పట్టణంలోని చిన్నమార్కెట్‌ కూడలి వద్ద సోమవారం మధ్యాహ్నం తెదేపా నాయకులు అడ్డుకునేందుకు యత్నించారు. ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు డీఈ రమేష్‌కుమార్‌, కౌన్సిలర్‌ రాఘవేంద్ర, నాయకులు నాగేంద్ర, చంద్రమోహన్‌, నవీన్‌, మోదాశివ తదితరులు ఎంపీ కారుకు అడ్డంగా వెళ్లి మాధవ్‌ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. ఎంపీ ప్రయాణించే కారు ముందుకు వెళ్లగా.. వెనుక వస్తున్న ఎమ్మెల్సీ ఇక్బాల్‌ కారునూ వారు అడ్డగించగా వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు తెదేపా నాయకులను బలవంతంగా పక్కకు తీసుకువెళ్లి కార్లను ముందుకు పోనిచ్చారు.

సంతేబిదనూరు క్రాస్‌లోనూ.. చౌళూరుకు ఎంపీ మాధవ్‌ వెళ్లగా.. మార్గమధ్యలో సంతేబిదనూరు క్రాస్‌ వద్దకు తెదేపా నాయకులు చేరుకొని ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు. వైకాపా నాయకులు గోపీకృష్ణ, కౌన్సిలర్‌ మహేష్‌గౌడ్‌ తదితరులు అక్కడికి చేరుకొని తెదేపా నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకొని ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు రంగప్రవేశం చేసి తెదేపా నాయకులను అరెస్టు చేయటానికి ప్రయత్నించగా ఆ పార్టీ నాయకురాళ్లు రామాంజమ్మ, విజయలక్ష్మీ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి పట్టణ ఒకటో పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి సాయంత్రం విడుదల చేశారు. తమ పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారని తెదేపా నాయకులు ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని