షర్మిల భాజపా వదిలిన బాణం: కవిత

తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వైతెపా అధ్యక్షురాలు షర్మిలలు ట్విటర్‌ వేదికగా బుధవారం పరస్పరం విమర్శలు చేసుకున్నారు. షర్మిల భాజపా వదిలిన బాణం అని కవిత ట్వీట్‌ చేశారు.

Updated : 01 Dec 2022 06:02 IST

పదవులే గానీ పనితనం లేదని షర్మిల ప్రతివిమర్శ

ఈనాడు,హైదరాబాద్‌: తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వైతెపా అధ్యక్షురాలు షర్మిలలు ట్విటర్‌ వేదికగా బుధవారం పరస్పరం విమర్శలు చేసుకున్నారు. షర్మిల భాజపా వదిలిన బాణం అని కవిత ట్వీట్‌ చేశారు. ఆమె తానా అంటే.. భాజపా రాష్ట్ర నేతలు తందానా అంటున్నారని విమర్శించారు. కవిత ట్వీట్‌కు స్పందించిన షర్మిల ఘాటు విమర్శలు చేశారు. ‘‘ఎమ్మెల్సీ కవిత పాదయాత్రలు చేసింది లేదు.. ప్రజాసమస్యలు చూసింది లేదు.. పదవులే కానీ.. పనితనం లేని గులాబీ తోటలో కవితలకు కొదవలేదు’’ అంటూ ప్రతి విమర్శ చేశారు. దీనిపై కవిత స్పందించారు. ‘‘అమ్మా.. కమల బాణం.. ఇది మా తెలంగాణం.! పాలేవో నీళ్లేవో తెలిసిన చైతన్య ప్రజాగణం.. మీకు నిన్నటి దాకా పులివెందులలో ఓటు. నేడు తెలంగాణ రూటు.. మీరు కమలం కోవర్టు. ఆరెంజ్‌ ప్యారెట్టు. మీ లాగా పొలిటికల్‌ టూరిస్ట్‌ను కాను నేను. రాజ్యం వచ్చాకే రాలేదు నేను. ఉద్యమంలో నుంచి పుట్టిన మట్టి ‘కవిత’ను నేను’’ అని పేర్కొన్నారు.

నేడు గవర్నర్‌ను కలవనున్న షర్మిల

వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల గురువారం రాష్ట్ర గవర్నర్‌ తమిళిసైని కలవనున్నారు. సోమవారం వరంగల్‌ జిల్లా నర్సంపేటలో ప్రజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా చోటుచేసుకున్న దాడి, వాహనాలకు నిప్పుపెట్టడం తదితర పరిణామాలతో పాటు మంగళవారం హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేసిన తీరుపై ఆమె గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. తనపై, పార్టీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయడంపైనా షర్మిల గవర్నర్‌కు వివరించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని