తెలంగాణ తరహా మహోద్యమానికి సిద్ధం కావాలి

అధికారాన్ని అడ్డంపెట్టుకుని వేల కోట్లు దోచుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబాన్ని తరిమికొట్టడానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన తరహాలో మరో మహోద్యమానికి సిద్ధం కావాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు.

Published : 04 Dec 2022 05:12 IST

ప్రజా సంగ్రామయాత్రలో బండి సంజయ్‌ పిలుపు

నిర్మల్‌, న్యూస్‌టుడే, ఈనాడు, హైదరాబాద్‌: అధికారాన్ని అడ్డంపెట్టుకుని వేల కోట్లు దోచుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబాన్ని తరిమికొట్టడానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన తరహాలో మరో మహోద్యమానికి సిద్ధం కావాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా శనివారం నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌, సిర్గాపూర్‌ గ్రామాల్లో నిర్వహించిన సభలలో ఆయన మాట్లాడారు. దిల్లీ మద్యం కేసులో ఇరుక్కున్న తన బిడ్డ కవితను కాపాడుకునేందుకు తెలంగాణ, మహిళ అనే సెంటిమెంటును కేసీఆర్‌ రగిలిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అర్హులైన వారికి ఇళ్లు ఇవ్వలేదని, ఉద్యోగాలు రాలేవని, నిరుద్యోగ భృతి అందలేదని, రుణమాఫీ చేయలేదని, చేనేత కార్మికులు సహా చేతి వృత్తుల ఆకలి చావులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. రైతులను బికారీలుగా మార్చారని, ఎనిమిదేళ్ల తెరాస అధికారంలో పంట నష్టం కింద ఒక్క పైసా కూడా పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని, ముఖ్యమంత్రి కేవలం దళారీగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. కేంద్ర నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. దిలావర్‌పూర్‌ మండలం లోలం దగ్గర చక్కెర పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పి వందల ఎకరాల భూములు తీసుకుని రైతులను మోసం చేశారని, భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూములను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. బాసర ఆర్జీయూకేటీలో నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటుచేసి విద్యార్థులను తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో ఎంపీ సోయం బాపురావు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారు: సంజయ్‌

కేంద్రంలో మోదీ ప్రభుత్వం దేశంలోని అయిదు కోట్ల మంది దివ్యాంగుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలతో వారికి పూర్తి న్యాయం జరుగుతోందని సంజయ్‌ పేర్కొన్నారు. అదే సమయంలో రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం వారి సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తోందని  విమర్శించారు. ‘రాష్ట్రంలో 26 లక్షల మంది దివ్యాంగులు ఉంటే 44%మందికి పింఛన్లు రావట్లేదు. అర్హత పత్రాలు జారీచేసే సదరంశిబిరాలు మొక్కుబడిగా సాగుతున్నాయి’ అని శనివారం ఓ ప్రకటనలో ఆయన విమర్శించారు.

అండగా మోదీ ప్రభుత్వం: కిషన్‌రెడ్డి

దివ్యాంగుల పట్ల రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండగా మోదీ ప్రభుత్వం అండగా నిలుస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘సిరిసిల్ల, హైదరాబాద్‌లో 3,816 మంది దివ్యాంగుల్ని కేంద్రం గుర్తించింది. వీరికి సహాయ పరికరాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాలి.’ అని ఒక ప్రకటనలో కోరారు.

మద్యం కుంభకోణంలో ముగ్గురు సీఎంల పాత్ర: తరుణ్‌ఛుగ్‌

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కుంభకోణంలో పంజాబ్‌, తెలంగాణ, దిల్లీ ముఖ్యమంత్రులకు పాత్ర ఉందని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి  తరుణ్‌ఛుగ్‌ ఆరోపించారు. దిల్లీలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ని ఎందుకు కలిశారని... మద్యం కేసులో కేసీఆర్‌ కుమార్తె కవిత ఎందుకు భయపడుతున్నారని, ఎందుకు ఫోన్లు ధ్వంసం చేశారని ప్రశ్నించారు. పంజాబ్‌, తెలంగాణ, దిల్లీ ముఖ్యమంత్రుల మధ్య సంబంధాలపై విచారణ చేయాలన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు