Congress: ‘భద్రతా సిబ్బంది మాయం..’ రాహుల్‌ పాదయాత్ర నిలిపివేత!

భద్రతా కారణాలు, భారీ జనసమూహాల నియంత్రణలో వైఫల్యం కారణంగా జమ్మూ- కశ్మీర్‌లో రాహుల్‌ గాంధీ ‘భారత్‌ జోడో యాత్ర’ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ పరిస్థితులకు స్థానిక యంత్రాంగం నిర్లక్ష్యమే కారణమని పార్టీ నేతలు ఆరోపించారు. 

Updated : 27 Jan 2023 15:56 IST

శ్రీనగర్: కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) ఆధ్వర్యంలో కొనసాగుతోన్న భారత్‌ జోడో యాత్ర(Bharat Jodo Yatra) నేడు జమ్మూ- కశ్మీర్‌(Jammu Kashmir)లో తాత్కాలికంగా నిలిచిపోయింది. యాత్ర మార్గంలో తీవ్రమైన భద్రతా లోపాలతోపాటు భారీ జన సమూహాలను నియంత్రించడంలో స్థానిక యంత్రాంగం వైఫల్యమే దీనికి కారణమని కాంగ్రెస్‌(Congress) నేతలు ఆరోపించారు. రాహుల్‌ గాంధీ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. తన భద్రతా సిబ్బంది సూచనల మేరకు పాదయాత్రను విరమించుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. దీంతో కశ్మీర్‌ లోయకు ప్రవేశ ద్వారం అయిన ఖాజీగుండ్ సమీపంలో యాత్రను ఈ రోజుకు తాత్కాలికంగా నిలిపేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

‘బనిహాల్‌ టన్నెల్‌ దాటి ఖాజీగుండ్‌కు చేరుకున్న రాహుల్‌.. షెడ్యూల్‌ ప్రకారం దక్షిణ కశ్మీర్‌లోని వెస్సు వైపు పాదయాత్ర ప్రారంభించారు. కానీ, అంతలోనే బాహ్య భద్రతా వలయాన్ని నిర్వహించాల్సిన స్థానిక పోలీసులు అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. భారీ జనసమూహాలను నియంత్రించడంలోనూ లోపాలు ఉన్నట్లు గుర్తించాం. దీంతో రాహుల్ సెక్యూరిటీ ఆయన్ను ముందుకు అనుమతించలేదు. అనంతరం ఆయన ఖానాబాల్ వద్ద ఏర్పాటు చేసిన నైట్ హాల్ట్ వేదిక వద్దకు వెళ్లిపోయారు’ అని కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. శుక్రవారం 11 కిలోమీటర్ల మేర పాదయాత్ర ఉండగా.. కిలోమీటర్‌లోపే నిలిపేయాల్సి వచ్చిందన్నారు. అంతకుముందు రాహుల్‌ దాదాపు 30 నిమిషాల పాటు ఎటూ కదలలేకపోయారని తెలిపారు.

భారత్ జోడో యాత్రకు భద్రత కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని కాంగ్రెస్‌ జమ్మూ-కశ్మీర్‌ ఇన్‌ఛార్జి రజనీ పాటిల్ ట్వీట్ చేశారు. స్థానిక యంత్రాంగం సంసిద్ధత లేని వైఖరిని ఇవి సూచిస్తున్నాయని విమర్శించారు. ఈ లోపాలకు బాధ్యులైన అధికారులు సమాధానం చెప్పాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ డిమాండ్‌ చేశారు. అంతా సజావుగా జరిగేలా చూసేందుకు రాహుల్‌ గాంధీ భద్రతా బృందం స్థానిక యంత్రాంగంతో చర్చలు జరుపుతోందని జైరాం రమేశ్‌ తెలిపారు. అంతకుముందు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్‌ అబ్దుల్లా యాత్రలో భాగమయ్యారు. ఈ యాత్ర లక్ష్యం రాహుల్ గాంధీ ప్రతిష్ఠను మెరుగుపరచడం కాదని, దేశంలో ప్రస్తుతం ఉన్న వాతావరణాన్ని మార్చడమని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని