DK Shivkumar: ఎన్నికల ప్రచారంలో కరెన్సీ నోట్లు వెదజల్లిన డీకేఎస్‌.. వీడియో వైరల్‌

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnatak Assembly Elections) ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీకి అన్ని తానై వ్యవహరిస్తున్న ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్‌  డీకే శివకుమార్‌ (DK Shivakumar) చేసిన పని సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Published : 29 Mar 2023 01:33 IST

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు (Karnatak Assembly Elections) సమీపిస్తున్న వేళ అధికార భాజపా, ప్రతిపక్ష కాంగ్రెస్‌ విజయమే లక్ష్యంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా పార్టీల నేతలు చేస్తున్న పనులు ప్రత్యర్థి పార్టీలకు విమర్శనాస్త్రాలుగా మారుతున్నాయి. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ (Congress) కార్యకర్తను మాజీ సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) చెంపదెబ్బకొట్టిన వీడియో వైరల్‌ అయింది. తాజాగా కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ (DK Shivakumar) ఎన్నికల ప్రచారంలో ప్రజలపైకి కరెన్సీ నోట్లు విసురుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.  దీంతో శివకుమార్‌ చర్యను భాజపా తప్పుపట్టింది. మాండ్య జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శివకుమార్‌ ప్రచార రథం పైనుంచి కింద ఉన్న ప్రజల పైకి రూ. 500 నోట్లు విసిరినట్లు వీడియోలో కనిపిస్తుంది. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో శివకుమార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అన్ని తానై వ్యవహరిస్తున్నారు. కన్నడ రాజకీయాల్లో బలమైన నేతగా ఆయనకు మంచి పేరుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తే సీఎం అభ్యర్థి రేసులో సిద్ధరామయ్యతోపాటు, శివకుమార్‌ పోటీ పడుతున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ 124 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌.. కనకపుర స్థానం నుంచి, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరుణ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు.  కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే కుమారుడు ప్రియాంక్‌ ఖర్గే.. చీతాపూర్‌ నుంచి, మాజీ ఉపముఖ్యమంత్రి జి. పరమేశ్వర కోరటగెరె స్థానం నుంచి బరిలో దించుతున్నట్టు కాంగ్రెస్‌ పార్టీ ఇటీవల ప్రకటించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని