Kishan reddy: హుజూరాబాద్‌ ఎన్నికలే ధాన్యం గొడవకు కారణం: కిషన్‌రెడ్డి

హుజూరాబాద్‌ ఎన్నికలే ధాన్యం గొడవకు కారణం అయ్యాయని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తెరాస ఓటమి చెందడం వల్లనే భాజపాని ధాన్యం కొనుగోళ్లపై టార్గెట్‌ చేస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు.

Published : 28 Mar 2022 01:12 IST

హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఎన్నికలే ధాన్యం గొడవకు కారణం అయ్యాయని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తెరాస ఓటమి చెందడం వల్లనే భాజపాని ధాన్యం కొనుగోళ్లపై టార్గెట్‌ చేస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. తెరాస కుటుంబ పాలన, కుటుంబ పెత్తనం భరించలేకనే ఈటల రాజేందర్‌ భాజపాలో చేరారని స్పష్టం చేశారు. హుజూరాబాద్‌ ఎన్నికల ముందు ధాన్యంపై ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బాయిల్డ్‌ రైస్‌కు దేశవ్యాప్తంగా డిమాండ్‌ లేదన్నారు. గతంలో వినియోగించేవారు కూడా ఇప్పుడు వాడటం లేదన్నారు. బాయిల్డ్‌ రైస్‌ను రైతులు పండించరని, రైస్‌ మిల్లులోనే బాయిల్డ్‌ రైస్‌ తయారవుతుందన్నారు.  2014లో ధాన్యం, బియ్యం సేకరణకు రూ.3,400 కోట్లు ఖర్చు చేస్తే, గతేడాది రూ.26,600 కోట్లు ఖర్చు చేశామన్నారు. గతేడాది రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం ప్రకారం చివరి బియ్యపు గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు. డబ్ల్యూహెచ్‌ఓ నిబంధనల ప్రకారం కేంద్రం విదేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేయలేదన్నారు. అందుకే ప్రైవేటు వారిని ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. కానీ, వారు కూడా ముందుకు రావడంలేదని కిషన్‌రెడ్డి వివరించారు.

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలు భాజపా భవిష్యత్‌కు అత్యంత కీలకమైనవని తెలిసినప్పటికీ .. ఆ రాష్ట్రంలో ఎలాంటి ఉచిత హామీలు  ఇవ్వకుండా దేశ భవిష్యత్‌ కోసమే తాము బడ్జెట్‌ ప్రవేశపెట్టామన్నారు. తెరాస మాత్రం వారి భవిష్యత్‌ కోసమే బడ్జెట్‌ ప్రవేశపెట్టిందన్నారు. భద్రాచలానికి రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ చేస్తే రైల్వే లైన్‌ వేస్తామని తెలిపారు. ఘట్‌కేసర్‌ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌కు రైల్వే లైన్‌ వేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. టెక్స్‌టైల్‌ పార్క్‌, ట్రైబల్‌ మ్యూజియం వంటివి ఏర్పాటు చేసేందుకు తాను లేఖ రాసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని