Harish rao: చెన్నూరు కోసం రూ.1600 కోట్లతో ఎత్తిపోతల పథకం: మంత్రి హరీశ్‌రావు

లక్ష ఎకరాలకు నీరందించే ఎత్తిపోతల పథకాన్ని రూ.1600 కోట్లతో చెన్నూరులో నిర్మించనున్నట్లు మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. దీనికి త్వరలో సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు.

Updated : 15 Mar 2023 18:31 IST

చెన్నూరు: మంచిర్యాల జిల్లా జైపూర్‌, భీమారం, చెన్నూర్‌ మండలాల్లో రూ.210 కోట్ల విలువైన 30 అభివృద్ధి పనులకు మంత్రి హరీశ్‌రావు (Minister Harish rao) శంకుస్థాపన చేశారు. చెన్నూరులో ఆర్‌వోబీ, 100 పడకల ఆస్పత్రి, గ్రంథాలయాలు, వీధిలైట్ల ఏర్పాటును ఆయన ప్రారంభించారు. లక్ష ఎకరాలకు నీరందించే ఎత్తిపోతల పథకాన్ని చెన్నూరులో నిర్మించనున్నట్లు మంత్రి ప్రకటించారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘‘మంచిర్యాల జిల్లాలో రూ.37 కోట్లతో రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌తో అభివృద్ధి కార్యక్రమం మొదలైంది. రూ.22 కోట్లతో 100 పడకల ఆస్పత్రి, రూ.3కోట్లతో స్టేడియం, రూ.4కోట్లతో బస్‌ డిపో, రూ.18 కోట్లతో బట్టర్‌ ఫ్లై లైట్లు, నస్పూర్‌లో రూ.3.50 కోట్లతో ఔషధ గిడ్డంగి ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం రూ.210 కోట్లతో 30 అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. ఈరోజు చెన్నూరు దశ దిశ మారుతోంది. చెన్నూరులో రూ.1600 కోట్లతో లక్ష ఎకరాలకు నీరందించే ఎత్తిపోతల పథకం కూడా మంజూరైంది. దీనికి సంబంధించి టెండర్లు పూర్తయ్యాయి. త్వరలో సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తాం’’ అని హరీశ్‌రావు తెలిపారు.

అనంతరం కాంగ్రెస్‌, భాజపాపై హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. ‘‘ఛత్తీస్‌గఢ్‌ పాలన తెస్తామని రేవంత్‌రెడ్డి అంటున్నారు. ఆ రాష్ట్ర పాలన తెలంగాణకు అవసరం లేదు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి వేలాది మంది ఇక్కడికి వలస వస్తున్నారు. తెలంగాణ ప్రజలు మరోచోటికి వలస వెళ్లాల్సిన పరిస్థితి వద్దు. మరోవైపు తెలంగాణ పథకాలనే కేంద్రం కాపీ కొడుతోంది. భాజపా నేతలు సీబీఐ, ఈడీ, ఐటీని నమ్ముకున్నారు. ప్రశ్నించిన వారిపై దర్యాప్తు సంస్థలతో దాడి చేయిస్తున్నారు’’ అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని