Congress: మోదీ 9 ఏళ్ల పాలన.. కాంగ్రెస్‌ 9 ప్రశ్నలు

కేంద్రంలో ఎన్డీయే సర్కారు ఏర్పడి 9 ఏళ్లు పూర్తయినా.. వారు ఇచ్చిన హామీలు మాత్రం వాస్తవరూపం దాల్చలేదని కాంగ్రెస్‌ (Congress) దుయ్యబట్టింది. ప్రజలను మోసం చేసినందుకు ప్రధాని మోదీ (PM Modi) క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.

Updated : 26 May 2023 19:58 IST

దిల్లీ: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ (PM Narendra Modi) బాధ్యతలు చేపట్టి శుక్రవారానికి తొమ్మిదేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా భాజపా (BJP) పలు చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. అయితే, ఎన్డీయే సర్కారు 9 ఏళ్ల పాలనను విమర్శిస్తూ కాంగ్రెస్‌ (Congress).. మోదీకి తొమ్మిది ప్రశ్నలు సంధించింది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతుల ఆదాయం వంటి అంశాలను ప్రస్తావిస్తూ హస్తం పార్టీ కేంద్రంపై ధ్వజమెత్తింది. ప్రజలను మోసం చేసినందుకు గానూ ప్రధాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) తన భారత్‌ జోడో యాత్ర సందర్భంగా కీలక అంశాలను లేవనెత్తారని, వాటిని ఆధారంగా చేసుకుని తాము కేంద్రాన్ని 9 ప్రశ్నలు అడుగుతున్నామని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ తెలిపారు. ‘నౌ సాల్‌.. నౌ సవాల్‌’ పేరుతో ఓ బుక్‌లెట్‌ కూడా విడుదల చేసినట్లు చెప్పారు.

కాంగ్రెస్‌ అడిగిన 9 ప్రశ్నలు ఇవే..

1. దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఎందుకు ఆకాశాన్నంటుతోంది? సంపన్నులు మరింత ధనవంతులుగా.. పేదలు మరింత నిర్భాగ్యులుగా ఎందుకు మారుతున్నారు? ప్రజల ఆస్తులను ప్రధాని మోదీ తన స్నేహితులకు ఎందుకు విక్రయిస్తున్నారు?

2. సాగు చట్టాలను రద్దు చేసినప్పుడు రైతులతో చేసుకున్న ఒప్పందాలను ఎందుకు గౌరవించట్లేదు? కనీస మద్దతు ధరకు చట్టబద్ధత ఎందుకు ఇవ్వట్లేదు? 9 ఏళ్లయినా రైతుల ఆదాయం రెట్టింపు కాలేదెందుకు?

3. మీ ఫ్రెండ్‌ అదానీ ప్రయోజనాల కోసం ఎల్‌ఐసీ, ఎస్‌బీఐలో ఉన్న ప్రజల కష్టార్జితాన్ని ఎందుకు రిస్క్‌లో పెట్టారు? భాజపా పాలిత రాష్ట్రాల్లో అవినీతిపై ఎందుకు మౌనంగా ఉంటున్నారు?

4. మీరు క్లీన్‌చిట్ ఇచ్చినా.. చైనా ఎందుకు ఇంకా భారత భూభాగాలను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తోంది. 18 సార్లు చర్చలు జరిగిన ప్రతిష్టంభన ఎందుకు కొనసాగుతోంది?

5. ఎన్నికల లబ్ధి కోసం విద్వేష రాజకీయాలను ఎందుకు ఉపయోగించుకుంటున్నారు? సమాజంలో భయానక వాతావరణాన్ని ఎందుకు సృష్టిస్తున్నారు?

6. మహిళలు, దళితులు, మైనార్టీలపై జరుగుతున్న దాడులపై ఎందుకు మౌనంగా ఉంటున్నారు? సామాజిక న్యాయ పునాదులను ఎందుకు నాశనం చేస్తున్నారు?

7. మన రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సంస్థలను ఎందుకు బలహీన పరుస్తున్నారు? ప్రతిపక్ష నేతలపై ప్రతీకార రాజకీయాలను ఎందుకు ప్రయోగిస్తున్నారు?ధనబలంతో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను ఎందుకు కూలుస్తున్నారు?

8. పేదలకు అందించే సంక్షేమ పథకాలకు బడ్జెట్‌ను తగ్గించి, కఠిన నిబంధనలు తీసుకొచ్చి వాటిని ఎందుకు బలహీనపరుస్తున్నారు?

9. ఉన్నట్టుండి లాక్‌డౌన్‌ విధించడంతో నష్టపోయిన లక్షలాది వలసకార్మికులకు ఎందుకు సాయం చేయలేదు? కొవిడ్ బాధిత కుటుంబాలకు ఎందుకు పరిహారం ఇవ్వట్లేదు?

ఈ ప్రశ్నలకు ప్రధాని (PM Modi) సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌ డిమాండ్ చేసింది. అంతేగాక.. ఈ తొమ్మిదేళ్లలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసినందుకు గానూ ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలంది. ఈ రోజును కేంద్ర ప్రభుత్వం ‘మాఫీ దివస్‌’గా నిర్వహించాలని హస్తం పార్టీ దుయ్యబట్టింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని