Opposition Meet: ‘భాజపా హఠావో.. దేశ్‌ బచావో కోసం మిషన్‌ మొదలైంది..’

ముంబయిలో విపక్ష నేతల భేటీ రెండో రోజు సందర్భంగా నేతలంతా సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు.

Updated : 01 Sep 2023 17:17 IST

ముంబయి:  దేశంలో ‘భాజపా హఠావో.. దేశ్‌ బచావో’ కోసం మిషన్‌ మొదలైందని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌(Lalu Prasad Yadav) అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా దేశంలో నిత్యావసర వస్తువుల ధరలను చూస్తున్నామన్నారు. ముంబయిలో విపక్ష కూటమి ‘ఇండియా’(I.N.D.I.A.) సమావేశం రెండోరోజు భేటీ సందర్భంగా నేతలంతా సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లాలూ మాట్లాడుతూ.. ‘‘మోదీ సర్కార్‌(PM Modi Govt) పతనం మొదలైంది.. ప్రజలకు అధిక ధరల నుంచి విముక్తి కలగాలంటే భాజపాను ఓడించాలి’’ అని పిలుపునిచ్చారు.  

‘ఇండియా’ను ఓడించడం భాజపా తరం కాదు.. రాహుల్‌

‘ఇండియా‘ కూటమిలోని పార్టీల మధ్య ఐక్యత అసాధ్యమని భాజపా విమర్శించిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) అన్నారు. భాజపా(BJP) అంచనాలు తారుమారు చేస్తూ తమ కూటమి పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పారు. ‘‘భాజపాను ఓడించేందుకు  కూటమి బలమైన నిర్ణయాలు తీసుకుంది. దేశంలో నలుగురికి మాత్రమే మేలు చేసేందుకు మోదీ సర్కార్‌ కృషిచేస్తోంది. ఇండియా కూటమిని ఓడించడం భాజపా తరం కాదు.  గతవారం లద్దాఖ్‌లో పర్యటించా. చైనా మన భూభాగాన్ని ఆక్రమిస్తోంది. చైనా ఆక్రమణపై మోదీ మౌనం అవమానకరం. అదానీ గ్రూపుపై అన్ని ఆరోపణలు వస్తుంటే విచారణ ఎందుకు జరపడంలేదు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. అదానీ వ్యవహారంపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది’’ అని రాహుల్ డిమాండ్‌ చేశారు.

లోక్‌సభ ఎన్నికల్లో కలిసే పోటీ.. ‘ఇండియా’ కూటమి తీర్మానం

ఇండియా కూటమిని చూసి భాజపా భయపడుతోంది.. ఠాక్రే

ఇండియా కూటమిని చూసి మోదీ సర్కార్‌ భయపడుతోందని శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. ఆ భయంతోనే గ్యాస్ ధర రూ.200లు తగ్గించిందని చెప్పారు. ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.200లు తగ్గించారు గానీ.. 2014లో దీని ధర ఎంత ఉండేదో, ఇప్పుడు ఎంత పెరిగిందో ప్రజలందరికీ తెలుసన్నారు. ఇండియా కూటమిని ఓడించడం ఎవరికీ సాధ్యం కాదని ఆ పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్‌ అన్నారు.  అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని ‘ఇండియా’ కూటమి పార్టీలు నిర్ణయించుకున్నాయని మహరాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే అన్నారు. తాము మిత్ర పరివార్‌వాద్‌ను అంగీకరించబోమన్నారు. 

మోదీ ఏకపక్ష నిర్ణయాలతో దేశం నష్టపోయింది.. ఖర్గే

భాజపా పాలనలో గ్యాస్‌ ,పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరిగాయని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మండిపడ్డారు.  ‘‘గ్యాస్‌ ధరను మోదీ సర్కార్‌ రెట్టింపు చేసి.. ఎన్నికల ముందు కంటి తుడుపుగా రూ.200లు తగ్గించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను భాజపా దుర్వినియోగం చేస్తోంది. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపైకి వెంటనే ఐటీ, ఈడీ, సీబీఐ వెళ్తోంది. ఎన్నో కీలక నిర్ణయాలను మోదీ ఏకపక్షంగా తీసుకున్నారు. దేశానికి ఇప్పుడు ఇండియా కూటమి గెలవాల్సిన అవసరం ఉంది. ఏకపక్షంగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో దేశం ఎంతో నష్టపోయింది. ప్రణాళికారహితమైన లాక్‌డౌన్‌ వల్ల వలస కార్మికులు అనేక ఇబ్బందులు పడ్డారు. అప్పుడు లేనిది.. ఇప్పుడు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో తెలియడంలేదు. కీలకమైన అంశంపైనా విపక్షాల అభిప్రాయాలు తీసుకోరు.  త్వరలోనే మళ్లీ ఇండియా కూటమి సమావేశం ఉంటుంది. తదుపరి సమావేశం తేదీ, ప్రదేశం త్వరలోనే వెల్లడిస్తాం.  మా అందరి ఉమ్మడి లక్ష్యం ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై పోరాడటమే.  బడా పారిశ్రామికవేత్తలకు సాయం చేసేందుకు పేదలను దోచేస్తున్నారు. ఈ దోపిడీ ఆపేందుకు ‘ఇండియా కూటమి’ తప్పకుండా విజయం సాధిస్తుంది’’ అని ఖర్గే విశ్వాసం వ్యక్తంచేశారు. 

ఇంత అహంకారమా..! అదే వారిని దించుతుంది: కేజ్రీవాల్‌

మోదీ సర్కార్‌ పతనం మొదలైందని ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అర్వింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ‘ఇండియా’ కేవలం కొన్ని పార్టీలతో కూడిన కూటమి మాత్రమే కాదని.. ఇది నవ భారత నిర్మాణాన్ని కోరుకొనే 140 కోట్ల మంది ప్రజల కూటమి అన్నారు. ‘‘ఈ కూటమిలో పదవుల కోసం చేరలేదు.. 140 కోట్ల భారతీయుల కోసం అంతా ఏకతాటిపైకి వచ్చాం. కేంద్రంలో ఇంత అహంకారపూరిత ప్రభుత్వం ఎప్పుడూ లేదు. వారి అహంకారమే వారిని దించుతుంది. కేంద్రం ఒకరిద్దరి కోసమే పనిచేస్తోంది. ప్రభుత్వం మొత్తం అవినీతిలో కూరుకుపోయింది. ఇంత అహంకారపూరిత ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదు.  భగవంతుడి కంటే తాము గొప్పవాళ్లనుకుంటున్నారు. మోదీ సర్కార్‌ను ఇండియా కూటమి ఓడిస్తుంది. ఎప్పుడూ తమ జబర్దస్తీ చూపించడానికే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన ఇండియా కూటమి భేటీల్లో ఎలాంటి పొరపొచ్చాలూ రాలేదు. ఇండియా కూటమి నేతలు 140 కోట్ల ప్రజల్ని రక్షించేందుకు వచ్చారు. భారత్‌ను సరైన మార్గంలో నడిపించడానికే ఏకతాటిపైకి వచ్చారు’’ అన్నారు.

ముందే ఎన్నికలు రావొచ్చు.. నీతీశ్‌ పునరుద్ఘాటన

విపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తుండటంతో భాజపా భయపడుతోందని.. ఇప్పుడు కేంద్రంలో అధికారం కోల్పోక తప్పదని జేడీయూ అధినేత, బిహార్‌ సీఎం నీతీశ్ కుమార్‌ అన్నారు. కచ్చితంగా తెలియకపోయినప్పటికీ.. త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆయన పునరుద్ఘాటించారు. తామంతా అప్రమత్తంగా ఉండాలని.. ఈ అంశంపైనా కూటమి భేటీలో చర్చించినట్టు చెప్పారు.

  • లౌకిక శక్తులన్నీ ఏకతాటిపైకి రావడంతో భాజపా ప్రభుత్వం వణుకుతోంది.. దేశవ్యాప్తంగా బహిరంగ సభలతో ప్రజల్ని సంఘటితం చేస్తాం- సీతారాం ఏచూరి
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని