AAP: కేజ్రీవాల్‌కు భంగపాటు.. ‘షో యువర్‌ డిగ్రీ’ పేరుతో ఆప్‌ ప్రచారం

మోదీ (Modi) విద్యార్హతలపై గుజరాత్‌ హైకోర్టు (Gujarat HighCourt)లో కేజ్రీవాల్‌కు భంగపాటు కలిగిన నేపథ్యంలో ఆప్‌ సరికొత్త ప్రచారాన్ని అందుకుంది. ‘షో యువర్‌ డిగ్రీ’ పేరుతో ప్రత్యేక ప్రచారం చేపట్టింది.

Updated : 11 Apr 2023 15:08 IST

దిల్లీ: ప్రధాని మోదీ (PM Modi) డిగ్రీ, పీజీ పత్రాలను చూపించాల్సిన అవసరం లేదంటూ గుజరాత్‌ హై కోర్టు (Gujarat High Court) తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీపార్టీ (AAP) సరికొత్త ప్రచారానికి తెర లేపింది. దిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి (Atishi) ‘ షో యువర్‌ డిగ్రీ’ (మీ డిగ్రీని చూపించండి) పేరిట ప్రచారాన్ని ప్రారంభించారు. తన డిగ్రీ పట్టాను మీడియాకు చూపిస్తూ.. భాజపా నేతలు కూడా ఇలాగే తమ డిగ్రీలను మీడియా ఎదుట ప్రదర్శించాలని డిమాండ్‌ చేశారు. ‘‘ మా నేతలు వాళ్ల డిగ్రీ పట్టాలను మీడియాకు చూపిస్తారు. నేను దిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏలో డిగ్రీ పొందాను. అంతేకాకుండా ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి రెండు మాస్టర్‌ డిగ్రీలు చేశాను. అవన్నీ ఒరిజినల్‌ డిగ్రీలే.’’ అని దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అతిషి పేర్కొన్నారు. అందరూ నేతలు, ముఖ్యంగా భాజపా నాయకులు ఇలా తమ డిగ్రీలను ప్రదర్శించాలని కోరారు.

ప్రధాని మోదీ విద్యార్హతలపై దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌ సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేయడం, ఆయనకు కోర్టు రూ. 25వేల జరిమానా విధించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. మోదీ డిగ్రీ, పీజీ పట్టాల కోసం 2016లో సమాచార హక్కు చట్టం ద్వారా కేంద్ర సమాచార కమిషన్‌ (CIC)కి దరఖాస్తు చేసుకున్నారు. మోదీ డిగ్రీ, పీజీ పత్రాలను చూపించాలంటూ పీఎంవో కార్యాలయ పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌ (పీఐవో), గుజరాత్‌, దిల్లీ యూనివర్శిటీల పీఐవోలను 2016 ఏప్రిల్‌లో ఆదేశించింది. అయితే మూడు నెలల తర్వాత సీఐసీ ఆదేశాలను సవాల్‌ చేస్తూ గుజరాత్‌ యూనివర్శిటీ.. రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. దీంతో సీఐసీ ఆదేశాలపై అప్పుడు హైకోర్టు స్టే విధించింది. తాజాగా ఇటీవల దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం ప్రధాని డిగ్రీ, పీజీ పత్రాలను పీఎంవో చూపించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. అంతేకాకుండా సహచట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నందుకు గానూ కేజ్రీవాల్‌కు రూ.25 వేల జరిమానా విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని