Sonia Gandhi: మైనార్టీలను హింసిస్తున్నారు.. గాంధీని చంపినవారిని కీర్తిస్తున్నారు: సోనియా ఫైర్‌

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వేదికగా కాంగ్రెస్‌ పార్టీ నవ సంకల్ప్‌ చింతన్‌ శిబిరం మొదలైంది. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలంతా.....

Updated : 13 May 2022 16:28 IST

ఉదయ్‌పూర్‌: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వేదికగా కాంగ్రెస్‌ పార్టీ నవ సంకల్ప్‌ చింతన్‌ శిబిరం మొదలైంది. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలంతా సమాలోచనలు చేస్తున్నారు. నవ సంకల్ప్‌ పేరిట పార్టీ ప్రక్షాళన, ఎన్ని కష్టాలు ఎదురైనా పార్టీని బలమైన శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగాలంటూ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ప్రారంభోపన్యాసంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ, ఆయన సహచరులు నిత్యం ప్రవచించే కనిష్ఠ ప్రభుత్వం గరిష్ఠ పాలన నినాదానికి  అర్థం ప్రజల్లో చీలిక తేవడం, మైనార్టీలపై దాడులు, రాజకీయ ప్రత్యర్థులను బెదిరించడమేనన్నారు. దేశాన్ని శాశ్వతంగా చీలిక స్థితిలో ఉంచడం, ప్రజలు నిరంతరం భయం, అభద్రతలో బతికేలా చేయడమే దాని అర్థమని పేర్కొన్నారు. సమాజంలో అంతర్భాగంగా ఉన్న మైనార్టీలను తరచూ లక్ష్యంగా చేసుకోవడం, వారిని బాధితులుగా చేయడమే ‘కనిష్ఠ ప్రభుత్వం- గరిష్ఠ పాలన’ అనే నినాదం అర్థమంటూ మండిపడ్డారు. మోదీ పాలనలో ప్రజలు భయంభయంగా బతుకుతున్నారని వ్యాఖ్యానించారు. మైనార్టీలను హింసిస్తున్నారని, గాంధీజీని చంపిన వాళ్లను కీర్తిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ నేతలు వ్యక్తిగత స్వార్థం వీడాలని విజ్ఞప్తి చేశారు. 

పార్టీ మనకు చాలా ఇచ్చింది.. తిరిగి ఇవ్వాల్సిన సమయమిదే..!

దేశంలో సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని సోనియా ఆందోళన వ్యక్తంచేశారు. నరేంద్ర మోదీ పాలన ఇకపై కూడా కొనసాగితే దేశం అనేక సవాళ్లను, ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మోదీని దీటుగా ఎదుర్కొనేందుకు, పార్టీని ప్రబల శక్తిగా తీర్చిదిద్దేందుకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చి దేశ సమగ్రతను నిలబెట్టేందుకు సిద్ధంగా ఉండాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. గాంధీ చంపిన వాళ్లను కీర్తిస్తూ.. వారిని హీరోలుగా చిత్రీకరించడం ద్వారా గాంధీజీ, నెహ్రూలకు సంబంధించిన జ్ఞాపకాలను లేకుండా చేసే కుట్రలు జరుగుతున్నాయని సోనియా ఆరోపించారు. వీటిని పూర్తిస్థాయిలో ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. మతపరమైన విభజనను ఎదుర్కొని దేశాన్ని పునర్మించాలనే లక్ష్యంతో మున్ముందు పనిచేయాలని నిర్దేశించారు. ఇప్పటివరకు నేతలు, కార్యకర్తలకు కాంగ్రెస్‌ పార్టీ చాలా ఇచ్చిందని.. ఇప్పుడు మనమంతా పార్టీకి ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అందుకోసం ప్రతిఒక్కరూ ముందుకు రావాలని శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. 

పార్టీలో తక్షణ మార్పులు అవసరం..

భాజపా, ఆరెస్సెస్‌, దాని అనుబంధ సంస్థల విధానాల ఫలితంగా దేశం ఎదుర్కొంటోన్న అనేక సవాళ్లపై చర్చించేందుకు నవ సంకల్ప్‌ చింత్‌ శిబిర్‌ అవకాశం కల్పిస్తోందని సోనియా గాంధీ అన్నారు.  ప్రస్తుత సమయంలో పార్టీలో సత్వరమే సంస్థాగత మార్పులు చేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. నేతల పనితీరులోనూ మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. వ్యక్తిగత లక్ష్యాల కన్నా సంస్థపైనే ఎక్కువ దృష్టిపెట్టాలన్నారు. పార్టీ నేతలంతా చింతన్‌ శిబిరంలో తమ అభిప్రాయాలను బహిరంగంగా చెప్పాలని విజ్ఞప్తి చేసిన సోనియా.. అయితే, పార్టీ బలంగా, ఐక్యంగా ఉందనే సందేశాన్ని దేశానికి ఇవ్వాలన్నారు. పార్టీ వ్యూహాల్లోనూ మార్పు అవసరమన్నారు. ద్వేషం రగిలించే మంట ప్రజల జీవితాలపై పెను ప్రమాదం తీసుకొస్తుందన్న ఆమె.. ఇది తీవ్ర సామాజిక పరిణామాలకు దారితీస్తుందని.. ఊహించిన దానికన్నా తీవ్రమైందేనన్నారు. చింతన్‌ శిబిరం దేశంలోని సమస్యలను చర్చిచేందుకు, ఆత్మశోధన అర్థవంతంగా కొనసాగేందుకు ఓ గొప్ప అవకాశంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. 

చర్చల్లోకి మొబైల్‌ ఫోన్లకు ‘నో’

చింతన శిబిరానికి సోనియా, రాహుల్‌, ప్రియాంక సహా దాదాపు 400 మందికి పైగా నేతలు హాజరయ్యారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత నిర్వహిస్తున్న ఈ మేథోమథన సదస్సులో కీలక మార్పులు జరుగుతాయని ఇప్పటికే ఆ పార్టీ సీనియర్‌ నేత అజయ్‌ మాకెన్‌ వ్యాఖ్యానించారు. కుటుంబంలో ఒకరికే ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పించే అంశం పరిశీలనలో ఉన్నట్టు తెలిపారు. సోనియా గాంధీ ప్రారంభోపన్యాసం తర్వాత ప్రతినిధులంతా ఆరు గ్రూపులుగా ఏర్పడి చర్చలు మొదలు పెట్టారు. దేశంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు, ఉపాధి, రైతులకు సంబంధించిన అంశాలతో పాటు కాంగ్రెస్‌ పార్టీ ప్రక్షాళన అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నట్టు సమాచారం. ఈ చర్చల క్రమంలో పార్టీ కీలక జాగ్రత్తలు తీసుకుంది. ఏ ఒక్క నేత కూడా మొబైల్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలను లోపలికి తీసుకెళ్లరాదని ఆదేశించింది. చర్చల సమయంలో వాటిని తమ వద్ద పెట్టుకోవద్దని కఠిన హెచ్చరికలు చేసింది. చర్చలు జరిగే అంశాల్లో ఏ ఒక్క విషయం బయటకు రాకుండా గోప్యత పాటించాలని ఏఐసీసీ అధిష్ఠానం ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని