Ap News: ఎయిడెడ్‌ విద్యాసంస్థలపై జగన్‌ చర్యలు.. బజారునపడ్డ విద్యార్థులు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్ విద్యాసంస్థల పట్ల వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు విద్యావ్యవస్థ మనుగడకే గొడ్డలిపెట్టని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

Updated : 27 Oct 2021 05:51 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్ విద్యాసంస్థల పట్ల వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు విద్యావ్యవస్థ మనుగడకే గొడ్డలిపెట్టని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. విద్యార్థులు, తల్లిదండ్రుల డిమాండ్‌కు తగ్గట్లుగా ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకుంటే బాధితుల పక్షాన తెదేపా పోరాడుతుందని హెచ్చరించారు. జగన్ రెడ్డి చర్యలతో విద్యార్థులు బడిలో ఉండకుండా బజారున పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిడెడ్ విద్యా విధానాన్ని నిర్వీర్యం చేస్తూ పేద విద్యార్థుల జీవితాలతో పాలకులు ఆడుకోవటం సరికాదని హితవు పలికారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకొచ్చిన ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

‘‘విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. కొవిడ్ కారణంగా విద్యా సంవత్సరం రెండు నెలలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఇప్పటికే ఆందోళనలో ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులను విలీనం నిర్ణయంతో మరింత ఒత్తిడికి గురిచేస్తున్నారు. విద్యా సంవత్సరం మధ్యలో ఈ చర్యలు విద్యార్థుల భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టేస్తుంది. ఎయిడెడ్ విద్యాసంస్థలకు ప్రభుత్వ సాయాన్ని నిలిపివేయటంతో పేద విద్యార్థులు ఫీజులు కట్టలేక మధ్యలోనే చదువులు ఆపేసే ప్రమాదం ఉంది. 150 ఏళ్లుగా కొనసాగుతున్న ఎయిడెడ్ వ్యవస్థను ఎందుకు నీరుగార్చుతున్నారు? విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకొనే ఇలాంటి అనాలోచిత నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి’’ అని చంద్రబాబు అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని