Opposition meet: ప్రతిపక్షాల ఐక్యతారాగం.. బాంబు పేల్చిన ఆమ్‌ ఆద్మీ

దిల్లీ ఉద్యోగుల అంశంలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్‌ (Congress) తన స్పష్టమైన వైఖరిని తెలిపేంత వరకు భవిష్యత్‌లో జరగబోయే విపక్షాల కూటమి సమావేశాలకు ఆప్‌ హాజరుకాబోదని ఆ పార్టీ అధిష్ఠానం స్పష్టం చేశారు.

Published : 24 Jun 2023 01:07 IST

దిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో భాజపాను గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ సమావేశమైన వేళ ఆమ్‌ఆద్మీ పార్టీ బాంబు పేల్చింది. దిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ విషయంలో కాంగ్రెస్‌ తన వైఖరిని బయటపెట్టేంత వరకు భవిష్యత్‌లో జరగబోయే ప్రతిపక్షాల సమావేశాలకు ఆప్‌ హాజరు కాబోదని తెగేసి చెప్పింది. ఇవాళ పట్నాలో సమావేశమైన అనంతరం విపక్ష పార్టీలన్నీ ఐక్యతారాగం వినిపిస్తున్న నేపథ్యంలో ఆప్‌ అధిష్ఠానం నిర్ణయం చర్చనీయాంశమైంది. ఆర్డినెన్స్‌ అంశంలో కాంగ్రెస్‌ తన వైఖరి తెలపాలంటూ గురువారం కూడా ఆప్‌ అల్టిమేటం జారీ చేసింది. అయినప్పటికీ హస్తం పార్టీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

‘‘ఆర్డినెన్స్‌పై నిర్ణయం తీసుకోవడంలో కాంగ్రెస్‌ సంకోచిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీతో కలిసి అడుగులేయడం ఆప్‌కు కష్టతరమవుతుంది. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్‌ బహిరంగంగా వ్యతిరేకించాలి. అంతేకాకుండా రాజ్యసభలో 31 మంది కాంగ్రెస్‌ ఎంపీలు ముక్తఖంఠంతో ఆర్డినెన్స్‌ను అడ్డుకోవాలి. అప్పుడే విపక్షాల కూటమిలో ఆప్‌ భాగస్వామి అవుతుంది. లేదంటే కాంగ్రెస్‌ భాగస్వామిగా ఉన్న భావసారూప్య పార్టీలు నిర్వహించే సమావేశాలకు ఆప్‌ దూరంగా ఉంటుంది’’ అని ఆప్‌ అధిష్ఠానం ప్రకటన విడుదల చేసింది. ఆర్డినెన్స్‌ అంశంలో మోదీ ప్రభుత్వంతో ఏకీభవిస్తారో లేదా దిల్లీ ప్రజలతో మమేకమవుతారో కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించుకోవాలని ఆప్‌ పేర్కొంది.

సమావేశం జరుగుతున్న సమయంలోనూ ఆర్డినెన్స్‌ అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ వైఖరి ఏంటో తెలపాలని కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేసినట్లు సమాచారం. మరోవైపు ఆర్డినెన్స్‌ విషయంలో భాజపాతో కాంగ్రెస్‌ ఒప్పందం కుదుర్చుకుందని, అందుకే తన నిర్ణయాన్ని తెలిపేందుకు తాత్సారం చేస్తోందని ఆప్‌ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్‌ ఆరోపించారు. వీటిని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖండించారు. వచ్చే నెలలో శిమ్లాలో జరగబోయే తదుపరి సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు ఇలాంటి సమస్యలపై చర్చించేందుకు ఈ సమావేశం వేదిక కాదని కాంగ్రెస్‌ మొదట్నుంచీ చెబుతోంది. పార్లమెంట్‌ వేదికగా వాటిని అడ్డుకోవాలని అంటోంది.‘‘ ప్రభుత్వ నిర్ణయంతో ఏకీభవించడం, విభేదించడం పార్లమెంట్‌ వెలుపల జరగవు. పార్లమెంట్‌ లోపలే అది జరగాలి. పార్లమెంట్‌ సమావేశాల ప్రారంభానికి ముందు అన్ని పార్టీలు కలిసి చర్చించి ఉమ్మడి నిర్ణయం వెల్లడించాలి. ఆప్‌ నుంచి కూడా కొందరు నేతలు అఖిలపక్ష సమావేశానికి హాజరవుతున్నారు. వాళ్లకి అర్థమయ్యే ఉంటుంది. దీనిపై ఇప్పుడెందుకు ఇంత ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదు’’ అని మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు.

పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రాంతీయపార్టీలు కూడా ఇలా ఒక వేదిక మీదకి రావడం ఇదే తొలిసారి. మరోవైపు ఈ సమావేశాన్ని అధికార భాజపా ఓ ‘ఫొటో సెషన్‌’ గా అభివర్ణించింది. జమ్ములో నిర్వహించిన ఓ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మాట్లాడుతూ.. ప్రతిపక్షాల ఉమ్మడి సమావేశానికి ఎన్ని పార్టీలు వచ్చాయన్నది పక్కన పెడితే.. ఆ పార్టీలు ఏకాభిప్రాయానికి రావడం అసాధ్యమన్నారు.  2024 సార్వత్రిక ఎన్నికల్లో 300 కంటే ఎక్కువ స్థానాల్లో గెలుపొంది భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని