బెంగాల్‌లో భయానక రాజకీయం:గవర్నర్‌ ధన్‌ఖడ్‌

బెంగాల్‌ గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ మరోసారి మమతా బెనర్జీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

Published : 26 Jan 2022 13:02 IST

కోల్‌కత: బెంగాల్‌ గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ మరోసారి మమతా బెనర్జీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో భయానక రాజకీయ వాతావరణం ఉందని, ప్రజలు నిర్భయంగా ఓటుహక్కును వినియోగించుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా మంగళవారం అసెంబ్లీ ఆవరణలోని అంబేడ్కర్‌ విగ్రహానికి గవర్నర్‌ నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. బెంగాల్‌లో ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో ఉందన్నారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల అనంతరం తీవ్రస్థాయిలో జరిగిన హింసను చూశాం. ధైర్యంగా, సొంత అభిప్రాయంతో ఓటు వేయాలనుకొనే వారు ప్రాణాలనే పణంగా పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది’’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన లేదని, అంతా నాయకుల ఇష్టప్రకారం జరుగుతోందని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ నియమించిన నిజనిర్ధారణ కమిటీ కూడా చెప్పిందన్నారు. స్పీకర్‌ బిమాన్‌ బెనర్జీ రాజ్యాంగ నిబంధనల్ని అతిక్రమిస్తున్నారని, తాను కోరిన సమాచారం ఏదీ ఇవ్వడం లేదన్నారు. ఇటీవల బీఎస్‌ఎఫ్‌ పరిధి పెంపుపై అసెంబ్లీ చేసిన తీర్మానంపై వివరాలు కోరినా స్పీకర్‌ స్పందించలేదన్నారు. ముఖ్యమంత్రి మమతపైనా ధన్‌ఖడ్‌ విమర్శలు గుప్పించారు. రాజ్యాంగ సంరక్షణకర్తగా తాను అడిగే ప్రశ్నలకు ఆమె నుంచి సమాధానాలు రావడం లేదన్నారు. కీలక నిర్ణయాలను కూడా చర్చించడం లేదని అసహనం వ్యక్తంచేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని