Corona Virus: ఎండెమిక్‌గా కొవిడ్‌.. అంతమాత్రాన పూర్తిగా కనుమరుగైనట్లు కాదు..

 కొవిడ్‌-19 ఎండెమిక్‌గా మారినట్లు ప్రఖ్యాత మెడికల్‌ జర్నల్‌ ది లాన్సెట్‌ తన సంపాదకీయంలో పేర్కొంది. అంతమాత్రాన అది పూర్తిగా కనుమరుగైనట్లుకాదని, 

Updated : 15 Feb 2022 10:26 IST

ఇక మిగిలిన సాంక్రమిక వ్యాధుల పరిశోధనపై దృష్టిసారించాలి

ది లాన్సెట్‌ మెడికల్‌ జర్నల్‌ సంపాదకీయం

ఈనాడు, దిల్లీ: కొవిడ్‌-19 ఎండెమిక్‌గా మారినట్లు ప్రఖ్యాత మెడికల్‌ జర్నల్‌ ది లాన్సెట్‌ తన సంపాదకీయంలో పేర్కొంది. అంతమాత్రాన అది పూర్తిగా కనుమరుగైనట్లుకాదని, అది ఎప్పటికీ మనతోనే ఉంటుందని హెచ్చరించింది. అయితే తీవ్రత మాత్రం సీజనల్‌ ఇన్‌ఫ్లుయెంజా మాదిరిగా ఉంటుందని పేర్కొంది. రెండేళ్లుగా కొవిడ్‌-19 కారణంగా ఇతర వ్యాధులపై పరిశోధనలు దెబ్బతిన్నాయని, కరోనా తీవ్రత ముగింపు దశకు వచ్చినందున ఇకమీదట ఇతర సాంక్రమిక, అసాంక్రమిక వ్యాధులపై పరిశోధనలు ఉద్ధృతం చేయాల్సిన అవసరం ఉన్నట్లు తెలిపింది. ‘‘ఒమిక్రాన్‌ రకంతో ప్రపంచవ్యాప్తంగా కొత్త వేవ్‌ను సృష్టించిన కొవిడ్‌-19 ప్రపంచవ్యాప్తంగా దాదాపు తగ్గుముఖం పట్టిండి. మహమ్మారి దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లు కొన్ని అధికారిక వ్యవస్థలు ప్రకటించాయి. జనవరి చివరి వారంలోనే 2.2 కోట్ల కేసులు, 59వేల మరణాలు నమోదయిన విషయాన్ని మరిచిపోకూడదు. ఇక్కడ శుభవార్త ఏమంటే- విస్తృత స్థాయిలో టీకాల కార్యక్రమం జరిగిన దేశాల్లో కేసులు, మరణాల మధ్య తేడా కనిపించింది. అయితే ఆ లంకె పూర్తిగా తెగిపోలేదు. కొవిడ్‌-19 ఎండెమిక్‌గా మారినప్పటికీ అది ఎప్పటికీ మనతోనే ఉంటుంది. ఇది ఎండెమిక్‌గా మారినంత మాత్రాన తేలికైపోయిందనుకోవడానికి వీల్లేదు. ఎక్కువమంది జనాభా దీన్ని ఎదుర్కొనే రోగనిరోధకశక్తిని పెంచుకున్నారన్న సంకేతాలు ఉన్నాయి. 

రోగి తీవ్రత, వారి అనారోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని చూస్తే దీని తీవ్రత సీజనల్‌ ఇన్‌ఫ్లుయెంజాకు దగ్గరగా ఉంటుంది. వరుసగా వచ్చిన కొవిడ్‌ ఉద్ధృతుల కారణంగా ఈ వ్యాధిపై ఇదివరకు ఎన్నడూలేనంతగా పరిశోధనలు జరిగాయి. గత రెండేళ్లలో మొత్తం బయోమెడికల్‌ పరిశోధనను కరోనాయే ఆక్రమించేసింది. 2010-19 మధ్య దశాబ్దకాలంలో బ్రెస్ట్‌ నియోప్లాసియా, హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్, ఒబెసిటీ, లంగ్‌ నియోప్లాసియా, టైప్‌-2  మధుమేహంపై అత్యధిక పరిశోధనపత్రాలు వెలువడ్డాయి. 2020లో కొవిడ్‌పై చరిత్రలో ఎన్నడూలేని విధంగా 50వేల పరిశోధనపత్రాలు వెలువడ్డాయి. 2021లో ఆ సంఖ్య 78వేలను దాటిపోయింది. ఇదే సమయంలో బ్రెస్ట్‌ నియోప్లాసియా, హెచ్‌ఐవీల పరిశోధనపత్రాలు 2010స్థాయికి పడిపోయాయి. 2021 చివరికల్లా కొవిడ్‌-19యేతర రోగాలపై నాణ్యమైన పరిశోధన కథనాలు తగ్గిపోయినట్లు లాన్సెట్‌ సాంక్రమిత వ్యాధుల సంపాదకులు గుర్తించారు. వైద్య పరిశోధనలు మాత్రం కొవిడ్‌మయం కావడం మిగిలిన వాటిపై దీర్ఘకాలిక ప్రభావంచూపే అవకాశం ఉంది. 

మహమ్మారి సమయంలో ఎదురైన అనుభవాల గురించి తెలుసుకోవడానికి జర్నల్స్‌ ఇంటర్నేషనల్‌ అడ్వయిజరీబోర్డుకు చెందిన 23 మంది సభ్యులను సంప్రదించాం. అందులో అత్యధికమంది ఈ రెండేళ్ల కాలంలో వారి పరిశోధనలు అత్యధికం కొవిడ్‌కే పరిమితం అయినట్లు చెప్పారు. మరికొందరు తమ పాత పరిశోధనలు కొనసాగిస్తూనే కొవిడ్‌పైనా అధ్యయనం కొనసాగించారు. గత రెండేళ్లలో కొవిడ్‌-19పై కొనసాగిన విస్తృత పరిశోధనలు మానవజాతి సాధించిన విజయమే. మహమ్మారులను కూడా తట్టుకొని నిలిచి, దాన్ని ఎండెమిక్‌గా మార్చే సాధనాలను అది మనచేతిక్కిచ్చింది. ఈ విజయాన్ని నిలబెట్టుకోవాలంటే ఉత్తమమైన టీకాలు, చికిత్సలు అవసరం. కొవిడ్‌-19ను ఎదుర్కోవడంలో నేర్చుకున్న పాఠాలను దృష్టిలో ఉంచుకుని ఏటా ఎంతోమందిని పొట్టనబెట్టుకొనే ఇతర సాంక్రమిక, అసాంక్రమిక వ్యాధులపై పరిశోధనలను కొనసాగించాలి’’ అని లాన్సెట్‌ జర్నల్‌ తన సంపాదకీయంలో పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని