Corona Virus: గుండె లోపాలు ఉన్నవారికి.. కొవిడ్‌తో తీవ్ర అనారోగ్య ముప్పు

పుట్టుకతో హృదయ లోపాలు ఉండి, కరోనాకు గురైన వారికి... తీవ్ర అనారోగ్యం, ఐసీయూ చికిత్స, వెంటిలేటర్‌ అవసరంతో పాటు

Updated : 08 Mar 2022 10:47 IST

 తాజా పరిశోధనలో వెల్లడి

వాషింగ్టన్‌: పుట్టుకతో హృదయ లోపాలు ఉండి, కరోనాకు గురైన వారికి... తీవ్ర అనారోగ్యం, ఐసీయూ చికిత్స, వెంటిలేటర్‌ అవసరంతో పాటు మరణముప్పు కూడా ఎక్కువేనని తాజా పరిశోధనలో వెల్లడైంది. కొవిడ్‌ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైన వారిలో హృదయలోపం తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 50 ఏళ్ల పురుషులే ఎక్కువని పరిశోధకులు గుర్తించారు. యూఎస్‌ సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ శాస్త్రవేత్తలు దీన్ని సాగించారు. పుట్టుకతో వచ్చే హృదయ లోపాలు (కంజెనిటల్‌ హార్ట్‌ డిఫెక్ట్స్‌) ముఖ్యంగా 12 రకాలుగా ఉంటాయి. గర్భంలో ఉన్నప్పుడు గుండె, గుండెకు సమీపంలోని రక్తనాళాలు సాధారణంగా అభివృద్ధి చెందకపోవడం వల్ల చాలామంది ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు.

వీరిపై కొవిడ్‌ ప్రభావం ఎలా ఉంటోందన్న విషయమై శాస్త్రవేత్తలు పరిశోధన సాగించారు. ఇందులో భాగంగా, గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది జనవరి వరకూ ఆసుపత్రుల్లో కొవిడ్‌ బాధితుల చేరికలకు సంబంధించిన వివరాలను విశ్లేషించారు. 1 నుంచి 64 ఏళ్ల వయసున్న మొత్తం 2.35 లక్షల మంది బాధితుల ఆరోగ్య వివరాలను పరిగణనలోకి తీసుకున్నారు. వీరిలో కంజెనిటల్‌ హార్ట్‌ డిసీజ్‌ ఉన్నవారిని ఒక వర్గంగా, మిగతా వారిని మరో వర్గంగా విభజించి... వారిపై కొవిడ్‌ తీవ్రత ఎలా ఉందన్నది గమనించారు. అయితే, ఈ పరిశోధనకు చాలా పరిమితులున్నాయని, కేవలం ఆసుపత్రుల్లో చికిత్స పొందినవారి డేటాను మాత్రమే పరిశోధకులు విశ్లేషించారని నిపుణులు అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని