ధోనీ సిక్స్‌ కొట్టిన బంతి దొరికింది

వన్డే క్రికెట్‌ ప్రపంచకప్‌- 2011 ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా ధోనీ సిక్స్‌ కొట్టిన బంతి దొరికింది. దాదాపు పది సంవత్సరాల

Updated : 24 Sep 2020 04:32 IST

2011 వన్డే ప్రపంచ కప్‌ సమయంలో.. 

ముంబయి : వన్డే క్రికెట్‌ ప్రపంచకప్‌- 2011 ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా ధోనీ సిక్స్‌ కొట్టిన బంతి దొరికింది. దాదాపు పది సంవత్సరాల తర్వాత ఈ బంతి విషయం ఎందుకొచ్చిందని అనుకుంటున్నారా.. అయితే ఇది చదవండి. ఈ మ్యాచ్‌ను క్రీడా అభిమానులు మరిచిపోలేరు. 28 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ జట్టు సారథి ధోని సిక్స్‌ కొట్టి ప్రపంచకప్‌ను అందించిన తీరు క్రికెట్‌ ప్రేమికుల మదిలో మెదులుతూనే ఉంటుంది. శ్రీలంక బౌలర్‌ కులశేఖర వేసిన బంతిని ధోని సిక్సర్‌గా మలిచిన విధానం.. రవిశాస్ర్తి కామెంటరీ ఆ క్షణాన టీవీల్లో చూసిన వారు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. 

 ఆ మ్యాచ్‌లో ధోనీ కొట్టిన బంతి ఏమైంది..

ఆ సమయంలో దాన్ని ఎవరూ పట్టించుకోకపోయినా.. రాంచీ దిగ్గజం ఇటీవల రిటైర్‌మెంట్‌ ప్రకటించిన సమయంలో దానిపై చర్చ నడిచింది. దిగ్గజ ఆటగాడిని ప్రత్యేకంగా గౌరవించాలని ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌(ఎమ్‌సీఏ) నిర్ణయించింది. ధోనీ కొట్టిన బంతి పడిన సీటును శాశ్వతంగా ధోనీ కోసం కేటాయించాలని అసోసియేషన్‌ అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యుడు క్రికెట్‌ గవర్నింగ్ బాడీకి లేఖ రాశారు. అనంతరం మహీ కొట్టిన బంతి ఎక్కడ పడింది. దాన్ని ఎవరు తీసుకున్నారు అనే దానిపై ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌ వెతుకులాట ప్రారంభించింది. విషయం తెలుసుకున్న టీమిండిమా మాజీ సారథి గవాస్కర్‌ బంతి ఎక్కడుందో తెలుసుకోడానికి సాయం చేశారు. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ధోని సిక్స్‌గా మలిచిన బంతి తన స్నేహితుడి వద్ద ఉందని ఆయన ఎమ్‌సీఏకు తెలిపారు. స్టేడియంలోని ఎల్‌ బ్లాక్‌లో 210 సీటులో కూర్చున్న వ్యక్తి తన పక్క సీటులో పడిన బంతిని తీసుకున్నట్లు గవాస్కర్‌ చెప్పటంతో వెతుకులాటకు తెరపడింది.  

ధోని కొట్టిన బంతి పడిన సీటును అందంగా అలంకరించటంతో పాటు ప్రత్యేక అక్షరాలతో ఫలకాన్ని సైతం ఏర్పాటు చేస్తామని ఎమ్‌సీఏ సభ్యుడు తెలిపారు. దీంతో భవిష్యత్తులో మ్యాచ్‌లు చూడటానికి స్టేడియానికి వచ్చే అభిమానులు ధోని కొట్టిన సిక్స్‌ పడిన ప్రాంతాన్ని చూసి ప్రపంచ కప్‌ గెలిచిన ఆనంద క్షణాలను గుర్తు చేసుకుంటారని ఆయన అన్నారు. 


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని