Published : 01 Oct 2021 05:18 IST

మెరిసిన మంధాన..

ఆస్ట్రేలియాతో డేనైట్‌ టెస్టు

తొలి రోజు భారత్‌ 132/1

ఆటకు వరుణుడి అంతరాయం

గోల్డ్‌కోస్ట్‌

స్ట్రేలియాతో గులాబి బంతి టెస్టును భారత అమ్మాయిలు ఘనంగా ఆరంభించారు. తన టెస్టు కెరీర్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేస్తూ ఓపెనర్‌ స్మృతి మంధాన (80 బ్యాటింగ్‌; 144 బంతుల్లో 15×4, 1×6) రాణించడంతో తొలి రోజు ఆటలో ఆధిపత్యం టీమ్‌ఇండియాదే. గురువారం టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా.. తొలి ఇన్నింగ్స్‌లో   భారత్‌ను త్వరగా చుట్టేద్దామనుకుని బౌలింగ్‌ ఎంచుకుంది. కానీ టీమ్‌ఇండియా ఓపెనర్లు మంధాన, షెఫాలీ వర్మ (31) ప్రత్యర్థికి షాకిస్తూ భారత్‌కు మంచి ఆరంభాన్ని అందించారు. వర్షం అంతరాయం కలిగించిన తొలి రోజు 44.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. భారత్‌ 132/1తో ముగించింది. షెఫాలీ దూకుడుగా ఆడుతుందని తెలుసు. కానీ తొలి ఇన్నింగ్స్‌లో మాత్రం ఆ బాధ్యతను మంధాన తీసుకుంది.  ప్రత్యర్థి పేసర్లను ఒత్తిడిలోకి నెడుతూ.. కవర్‌డ్రైవ్స్‌, స్క్వేర్‌డ్రైవ్స్‌, పుల్‌ షాట్లతో చూడముచ్చటైన బౌండరీలు రాబట్టింది. రెండో ఓవర్లోనే రెండు ఫోర్లు కొట్టి తన ఉద్దేశాన్ని ఆమె.. ఎనిమిదో ఓవర్లో ఏకంగా నాలుగు ఫోర్లు బాదేసింది. బౌండరీతోనే 51 బంతుల్లో అర్ధ శతకాన్ని చేరుకుంది. మరోవైపు మూడు సార్లు క్యాచ్‌లు వదిలేయడంతో  బతికిపోయిన షెఫాలీ చివరకు సోఫీ బౌలింగ్‌లో తహిలాకు చిక్కడంతో.. 93 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత పూనమ్‌ రౌత్‌ (16 బ్యాటింగ్‌)తో కలిసి మంధాన ఇన్నింగ్స్‌ కొనసాగించింది. భారత్‌ తొలి సెషన్‌ ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 101 పరుగులు చేసింది. విరామం తర్వాత ఫ్లడ్‌ లైట్ల వెలుతురులో పోరు ఎలా ఉంటుందో అనే ఆసక్తిపై వరుణుడు దెబ్బకొట్టాడు. రెండో సెషన్లో ఏడో ఓవర్‌ మధ్యలో వచ్చిన వర్షం.. సుమారు రెండు గంటల పాటు అంతరాయం కలిగించింది. తిరిగి ఆట ఆరంభమైన తర్వాత ఓ సిక్సర్‌, ఫోర్‌తో అత్యధిక వ్యక్తిగత స్కోరు (78)ను దాటి శతకం దిశగా మంధాన వేగంగా సాగింది. కానీ మళ్లీ వచ్చిన వరుణుడు  ఇక వెళ్లకపోవడంతో తొలి రోజు ఆటను ఆపేశారు. శుక్రవారం కూడా వర్షం పడే సూచనలున్నాయి.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని