చిట్టి పోరులో గట్టెక్కారు

ఏడు గంటలకు మ్యాచ్‌ అన్నారు.. ఏడున్నరైంది.. ఎనిమిదైంది.. తొమ్మిదైంది.. అయినా ఆట మొదలవలేదు. ముందు రోజుల్లో కురిసిన వర్షం వల్ల మైదానంలో తడి ఉండడంతో చివరికి తొమ్మిదిన్నరకు మొదలైంది పోరు.

Updated : 24 Sep 2022 06:55 IST

రెండో టీ20 భారత్‌దే
అక్షర్‌ విజృంభణ.. రోహిత్‌ మెరుపులు
8 ఓవర్ల పోరులో ఆసీస్‌ ఓటమి

ఏడు గంటలకు మ్యాచ్‌ అన్నారు.. ఏడున్నరైంది.. ఎనిమిదైంది.. తొమ్మిదైంది.. అయినా ఆట మొదలవలేదు. ముందు రోజుల్లో కురిసిన వర్షం వల్ల మైదానంలో తడి ఉండడంతో చివరికి తొమ్మిదిన్నరకు మొదలైంది పోరు. 20 ఓవర్ల మ్యాచ్‌ కాస్తా 8
ఓవర్లకు పరిమితమైంది. అంత తక్కువ నిడివిలోనూ మలుపులేం తక్కువ కాదు. ఉత్కంఠకు లోటేం లేదు. ఇన్నింగ్స్‌ను పేలవంగా ఆరంభించినప్పటికీ, గొప్పగా ముగించి ఆసీస్‌ సవాలు విసిరితే.. అదిరే ఆరంభం తర్వాత మధ్యలో
తడబాటుకు గురైనప్పటికీ ముగింపులో తేడా రాకుండా చూసుకోవడంతో విజయం టీమ్‌ఇండియానే వరించింది. సిరీస్‌ 1-1తో సమమైంది. ఇక సిరీస్‌ ఫలితాన్ని తేల్చే మూడో టీ20 కోసం మన ఉప్పల్‌ స్టేడియం సిద్ధంగా ఉంది.

భారత్‌-ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌ రసవత్తర ముగింపు ముంగిట నిలిచింది. తొలి టీ20లో షాక్‌ తిన్న టీమ్‌ఇండియా.. రెండో టీ20లో పుంజుకుంది. విదర్భ క్రికెట్‌ స్టేడియం మైదానం తడిగా ఉండడంతో రెండున్నర గంటలు ఆలస్యంగా మొదలై, 8 ఓవర్లకు పరిమితమైన మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శుక్రవారం మొదట ఆసీస్‌ 5 వికెట్లకు 90 పరుగులు చేసింది. వేడ్‌ (43 నాటౌట్‌; 20 బంతుల్లో 4×4, 3×6), ఫించ్‌ (31; 15 బంతుల్లో 4×4, 1×6) మెరుపులు మెరిపించారు. అక్షర్‌ పటేల్‌ (2/13) ఆ జట్టును దెబ్బ కొట్టాడు. అనంతరం రోహిత్‌ శర్మ (46 నాటౌట్‌; 20 బంతుల్లో 4×4, 4×6) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. రోహిత్‌ జట్టుకు మెరుపు ఆరంభాన్నిచ్చాక.. స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా (3/16) స్వల్ప వ్యవధిలో రాహుల్‌ (10), కోహ్లి (11), సూర్యకుమార్‌ (0)లను ఔట్‌ చేసి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. హార్దిక్‌ (9) సైతం ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. అయితే ఒక ఎండ్‌లో రోహిత్‌ మాత్రం జోరు కొనసాగించాడు. చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా.. తొలి రెండు బంతులకు కార్తీక్‌ (10 నాటౌట్‌) వరుసగా 6, 4 ఫోర్‌ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. హోరాహోరీగా సాగుతున్న సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో టీ20 ఆదివారం ఉప్పల్‌లో జరగబోతుండడం హైదరాబాదీ అభిమానులకు పండగన్నట్లే.
అక్షర్‌ దెబ్బ కొట్టినా..: మొదట బౌలింగ్‌ చేయాలన్న తమ కెప్టెన్‌ నిర్ణయం సరైందేనని రుజువు చేస్తూ.. భారత బౌలర్లు ఆసీస్‌ను ఆరంభంలోనే కష్టాల్లోకి నెట్టారు. ముఖ్యంగా స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ కంగారూలను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ప్రమాదకర మ్యాక్స్‌వెల్‌, డేవిడ్‌లను అతను వరుస ఓవర్లలో బౌల్డ్‌ చేశాడు. అతడి తొలి బంతికే గ్రీన్‌ ఔట్‌ కావాల్సింది. బౌండరీ దగ్గర కష్టమైన క్యాచ్‌ను కోహ్లి అందుకోలేకపోయాడు. కానీ అందుకు చింతించాల్సిన అవసరం లేకపోయింది. ఆ ఓవర్‌ మూడో బంతికి కోహ్లినే గ్రీన్‌ (5)ను రనౌట్‌ చేశాడు. ఆరంభం నుంచి ధాటిగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్న ఫించ్‌ను బుమ్రా బౌల్డ్‌ చేయడంతో 5 ఓవర్లకు 46/4తో కష్టాల్లో పడింది. ఈ దశలో ఆ జట్టు 70-75 పరుగులు చేసేలా కనిపించింది. కానీ గత మ్యాచ్‌లో విధ్వంసక ఇన్నింగ్స్‌తో భారత్‌ కొంపముంచిన వేడ్‌.. మరోసారి చెలరేగిపోయాడు. ముఖ్యంగా హర్షల్‌ వేసిన చివరి ఓవర్లో నాలుగు బంతుల వ్యవధిలో మూడు మెరుపు సిక్సర్లతో స్కోరును 90కి చేర్చాడు.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: ఫించ్‌ (బి) బుమ్రా 31; గ్రీన్‌ రనౌట్‌ 5; మ్యాక్స్‌వెల్‌ (బి) అక్షర్‌ 0; డేవిడ్‌ (బి) అక్షర్‌ 2; వేడ్‌ నాటౌట్‌ 43; స్టీవ్‌ స్మిత్‌ రనౌట్‌ 8; ఎక్స్‌ట్రాలు 1 మొత్తం: (8 ఓవర్లలో 5 వికెట్లకు) 90
వికెట్ల పతనం: 1-14, 2-19, 3-31, 4-46, 5-90
బౌలింగ్‌: హార్దిక్‌ 1-0-10-0; అక్షర్‌ 2-0-13-2; చాహల్‌ 1-0-12-0; బుమ్రా 2-0-23-1; హర్షల్‌ 2-0-32-0
భారత్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (బి) జంపా 10; రోహిత్‌ నాటౌట్‌ 46; కోహ్లి (బి) జంపా 11; సూర్యకుమార్‌ ఎల్బీ (బి) జంపా 0; హార్దిక్‌ (సి) ఫించ్‌ (బి) కమిన్స్‌ 9; కార్తీక్‌ నాటౌట్‌ 10; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (7.2 ఓవర్లలో 4 వికెట్లకు) 92; వికెట్ల పతనం: 1-39, 2-55, 3-55, 4-77
బౌలింగ్‌: హేజిల్‌వుడ్‌ 1-0-20-0; కమిన్స్‌ 2-0-23-1; ఆడమ్‌ జంపా 2-0-16-3; సామ్స్‌ 1.2-0-20-0; అబాట్‌ 1-0-11-0

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని