సంక్షిప్త వార్తలు

రోడ్డు భద్రత ప్రపంచ టీ20 సిరీస్‌ ఫైనల్లో శనివారం ఇండియా లెజెండ్స్‌తో శ్రీలంక లెజెండ్స్‌ తలపడనుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో లంక 14 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ లెజెండ్స్‌ను ఓడించింది. మొదట లంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 172 పరుగులు చేసింది.

Published : 01 Oct 2022 02:53 IST

నేడే లంకతో భారత్‌ ఫైనల్‌

రాయ్‌పుర్‌: రోడ్డు భద్రత ప్రపంచ టీ20 సిరీస్‌ ఫైనల్లో శనివారం ఇండియా లెజెండ్స్‌తో శ్రీలంక లెజెండ్స్‌ తలపడనుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో లంక 14 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ లెజెండ్స్‌ను ఓడించింది. మొదట లంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 172 పరుగులు చేసింది. ఇషాన్‌ జయరత్నే (31), జీవన్‌ మెండిస్‌ (25), జయసూర్య (26) రాణించారు. ఛేదనలో విండీస్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులే చేయగలిగింది. డియో నారాయణ్‌ (63) ఒంటరిపోరాటం చేశాడు. కులశేఖర, జయసూర్య రెండేసి వికెట్లతో ప్రత్యర్థిని కట్టడి చేశారు.


బుమ్రా స్థానంలో సిరాజ్‌

దిల్లీ: దక్షిణాఫ్రికాతో చివరి రెండు టీ20లకు జస్‌ప్రీత్‌ బుమ్రా స్థానంలో హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఎంపికయ్యాడు. వెన్ను గాయం కారణంగా బుమ్రా దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌ ఆడని సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌కు అతడు దూరమైనట్లే! ‘‘అఖిల భారత సెలక్షన్‌ కమిటీ దక్షిణాఫ్రికాతో చివరి రెండు టీ20లకు బుమ్రా స్థానంలో సిరాజ్‌ను ఎంపిక చేసింది. బుమ్రా ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు’’ అని బీసీసీఐ కార్యదర్శి జై షా ఒక ప్రకటనలో తెలిపాడు. 28 ఏళ్ల సిరాజ్‌ ఇప్పటిదాకా అయిదు టీ20లాడి అయిదు వికెట్లే తీశాడు. చివరగా అతను ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీలంకతో టీ20 సిరీస్‌లో ఆడాడు. దక్షిణాఫ్రికాతో తొలి టీ20లో నెగ్గి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించిన టీమ్‌ఇండియా.. ఆదివారం గువాహటిలో ఆ జట్టుతో రెండో టీ20 ఆడుతుంది.


పని మొదలెట్టిన పర్యవేక్షక కమిటీ

హెచ్‌సీఏ క్లబ్‌ల వివరాలివ్వాలని అజహరుద్దీన్‌కు లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) వ్యవహారాల పర్యవేక్షక కమిటీ పని మొదలెట్టింది. హెచ్‌సీఏ క్లబ్‌ల వివరాలు ఇవ్వాలని అధ్యక్షుడు మహమ్మద్‌ అజహరుద్దీన్‌కు సుప్రీం కోర్టు నియమించిన ఈ కమిటీ వైస్‌ ఛైర్మన్‌, ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ అంజనీ కుమార్‌ లేఖ రాశారు. తమ విధుల్లో ముందుకు సాగాలంటే హెచ్‌సీఏలో పేర్లు నమోదు చేసుకున్న క్లబ్‌ల వివరాలు కావాలని శుక్రవారం సమావేశంలో పర్యవేక్షక కమిటీ నిర్ణయించిందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ నెల మూడో తేదీ మధ్యాహ్నం 12 లోపు ఈ వివరాలు కమిటీకి అందజేయాలని పేర్కొన్నారు. ‘‘హెచ్‌సీఏలో వ్యవస్థాగత మెరుగుదల కోసం మేం చర్యలు ప్రారంభించాం. తెలంగాణలోని కోట్లాది మందికి క్రికెట్‌ అంటే ఇష్టం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఎంతో మంది పేద క్రికెటర్లకు గొప్ప నైపుణ్యాలున్నాయి. హెచ్‌సీఏలో మేం వ్యవస్థాగత పరిస్థితులను మెరుగు పరిస్తే ఇలాంటి యువ ఆటగాళ్లకు తమ సత్తాచాటే అవకాశం దక్కుతుంది’’ అని అంజనీ కుమార్‌ తెలిపారు. హెచ్‌సీఏ పాలన వ్యవహారాల కోసం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ నిసార్‌ అహ్మద్‌ కక్రూ, అంజనీ కుమార్‌, మాజీ క్రికెటర్‌ వెంకటపతిరాజు, వంక ప్రతాప్‌లతో పర్యవేక్షక కమిటీని సుప్రీం కోర్టు నియమించిన సంగతి తెలిసిందే.


సెమీస్‌లో సిక్కి జోడీ

హో చి మిన్‌ సిటీ: వియత్నాం ఓపెన్‌ సూపర్‌ 100 సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో సిక్కిరెడ్డి-రోహన్‌ కపూర్‌ జోడీ సెమీఫైనల్లో ప్రవేశించింది. అన్‌సీడెడ్‌గా బరిలో దిగిన భారత జంట క్వార్టర్స్‌లో 21-19, 21-17తో చాన్‌ పెంగ్‌-చెయ్‌ యీ (మలేసియా)పై విజయం సాధించింది. తొలి గేమ్‌ ఆరంభంలో 3-6తో వెనకబడి పుంజుకున్న సిక్కి జోడీ.. ఆ తర్వాత మరోసారి 12-15తో వెనుకంజ వేసింది. అక్కడ నుంచి పుంజుకుని గేమ్‌ గెలిచింది. రెండో గేమ్‌లోనూ సిక్కి ద్వయానికి గట్టిపోటీ ఎదురైంది. ఒక దశలో స్కోరు 12-12తో సమమైంది. కానీ అక్కడ నుంచి విజృంభించిన భారత జోడీ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను దక్కించుకుంది. ఫైనల్లో చోటు కోసం రెహాన్‌ నఫాల్‌-లీసా (ఇండోనేసియా)తో సిక్కి-రోహన్‌ తలపడనున్నారు.


అలా అయితే వాళ్లు ఆడొచ్చు: బాక్‌

జెనీవా: ఉక్రెయిన్‌పై తమ దేశం చేస్తున్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న రష్యా అథ్లెట్లను క్రీడల్లోకి మళ్లీ స్వాగతించే అవకాశముందని అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు థామస్‌ బాక్‌ చెప్పాడు. ‘‘రష్యా పాస్‌పోర్టు ఉండి.. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న అథ్లెట్లను అంతర్జాతీయ క్రీడలకు అనుమతించాలని అనుకుంటున్నాం. మేం భవిష్యత్‌ గురించి ఆలోచించాల్సి ఉంది. ఈ యుద్ధాన్ని మొదలుపెట్టింది రష్యా కానీ వాళ్ల అథ్లెట్లు కాదన్నది మాకు తెలుసు’’ అని బాక్‌ అన్నాడు. కొంతమంది రష్యా టాప్‌ అథ్లెట్లు బహిరంగంగానే ఉక్రెయిన్‌పై యుద్ధానికి మద్దతు పలికారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ హాజరైన ఓ ర్యాలీలో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత, స్విమ్మర్‌ ఎవ్‌గెనీ రెలోవ్‌, జిమ్నాస్ట్‌ ఇవాన్‌ కాలిక్‌ పాల్గొన్నారు. రష్యా మాజీ అథ్లెట్లను కూడా సైన్యంలో చేరాల్సిందిగా కోరినట్లు వార్తలు వచ్చాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలుపెట్టిన తర్వాత అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ సలహా చాలా క్రీడల సంఘాలు రష్యా అథ్లెట్లపై వివిధ టోర్నీల్లో పాల్గొనకుండా నిషేధం విధించాయి.


ఇరానీ పోరు నేటి నుంచే

రెస్టాఫ్‌ ఇండియాతో సౌరాష్ట్ర ఢీ
ఉదయం 9.30 నుంచి

రాజ్‌కోట్‌: ఇరానీ కప్‌కు వేళైంది.. శనివారం ఆరంభమయ్యే ఈ టోర్నీలో జైదేవ్‌ ఉనద్కత్‌ సారథ్యంలోని సౌరాష్ట్ర.. హనుమ విహారి కెప్టెన్సీలోని రెస్టాఫ్‌ ఇండియాతో ఢీకొంటుంది. వెటరన్‌ బ్యాటర్‌ చెతేశ్వర్‌ పుజారా రాణించడంపైనే సౌరాష్ట్ర విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. బౌలింగ్‌లో కెప్టెన్‌ జైదేవ్‌ ఉనద్కత్‌, చేతన్‌ సకారియాపై ఆ జట్టు ఆశలు పెట్టుకుంది. మరోవైపు రెస్టాఫ్‌ ఇండియా ఓపెనర్లతో కిటకిటలాడుతోంది. భారత్‌-ఎ తరఫున న్యూజిలాండ్‌-ఎపై ఆడిన ప్రియాంక్‌ పాంచల్‌, అభిమన్యు ఈశ్వరన్‌లతో పాటు దులీప్‌ ట్రోఫీలో డబుల్‌ సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్‌, దేశవాళీలో రాణిస్తున్న మయాంక్‌ అగర్వాల్‌, యశ్‌ ధూల్‌ రూపంలో అయిదుగురు స్పెషలిస్ట్‌ ఓపెనర్లు ఆ జట్టుకు అందుబాటులో ఉన్నారు. రెస్ట్‌ తరఫున ఆంధ్ర వికెట్‌కీపర్‌ కోన శ్రీకర్‌ భరత్‌, సర్ఫ్‌రాజ్‌ ఖాన్‌ కూడా సెలెక్టర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించనున్నారు. బౌలింగ్‌లో ఉమ్రాన్‌ మాలిక్‌, కుల్‌దీప్‌ సేన్‌, అర్జాన్‌, సాయికిశోర్‌, సౌరభ్‌ కుమార్‌లకు సత్తా చాటేందుకు ఈ టోర్నీ మంచి వేదిక. ఈ ఏడాది రంజీ ఛాంపియన్‌ మధ్యప్రదేశ్‌ ఈ కప్‌లో ఆడాల్సి ఉంది. కానీ 2019-20 సీజన్లలో కొవిడ్‌-19 కారణంగా ఇరానీ ట్రోఫీ నిర్వహించకపోవడంతో అప్పటి ఛాంపియన్‌ సౌరాష్ట్రకు ముందుగా ఆడే అవకాశం దక్కింది. వచ్చే ఏడాది మార్చిలో రంజీ ఛాంప్‌ మధ్యప్రదేశ్‌ ఇరానీ ట్రోఫీ ఆడనుంది.


2023లో రయ్‌.. రయ్‌

వచ్చే ఏడాది భారత్‌లో మోటో గ్రాండ్‌ప్రి

దిల్లీ: భారత్‌కు మరోసారి రేసింగ్‌ కళ రాబోతోంది. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో మన దేశంలో రేసు నిర్వహించబోతున్నట్లు మోటోజీపీ వెల్లడించింది. ఈ రేసుకు బుద్ధ్‌ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌ వేదికగా నిలవనుంది. 2011 నుంచి 2013 వరకు ఇదే సర్క్యూట్‌లో ఫార్ములావన్‌ పోటీలు జరిగాయి. 21 రేసులు ఉన్న మోటో జీపీ క్యాలెండర్‌లో 14వ రేసుగా భారత్‌లో ఈ పోటీ జరగబోతోంది. ఇందుకోసం సెప్టెంబర్‌ 22-24లను తాత్కాలిక తేదీలుగా ఖరారు చేశారు. ‘‘2023 మోటర్‌ సైకిల్‌ గ్రాండ్‌ప్రి క్యాలెండర్‌లో బుద్ధ్‌ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌ కూడా చేరిందని చెప్పడానికి గర్విస్తున్నాం. ఫార్ములావన్‌కు భారత్‌లో ఎంతోమంది అభిమానులు ఉన్నారు. వారికి కూడా ఆటను దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నాం’’ అని మోటో జీపీ వాణిజ్య హక్కులను సొంతం చేసుకున్న డోర్నా కంపెనీ వెల్లడించింది. మోటర్‌ సైకిల్‌ గ్రాండ్‌ప్రికి ఆతిథ్యం ఇవ్వనున్న 31వ దేశం భారత్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని