Shami: ఒకప్పుడు బిర్యానీ ఎక్కువగా తినేవాడిని.. ఇప్పుడు నా డైట్‌ మారిపోయింది : షమీ

33 ఏళ్ల మహమ్మద్ షమీ (Shami) ఒకప్పుడు ఫిట్‌నెస్‌ విషయంలో చాలా ఇబ్బంది పడ్డాడు. డైట్‌ ప్రణాళిక మార్చుకోవడంతో ఫిట్‌నెస్‌ను మెరుగు పర్చుకున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో షమీ వెల్లడించాడు.

Published : 16 Dec 2023 01:31 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) అద్భుతమైన బౌలింగ్‌ దాడితో ప్రత్యర్థులను హడలెత్తించిన భారత బౌలర్ మహమ్మద్ షమీ (Shami) ప్రస్తుతం గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ఎంపికైనప్పటికీ ఫిట్‌నెస్‌ నిరూపించుకుంటేనే జట్టుతో చేరతాడు. ఫిట్‌నెస్‌ లేకపోతే ఆగిపోతాడు. ఈ క్రమంలో వరుసగా ఇంటర్వ్యూల్లో మాట్లాడుతున్న షమీ పలు విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నాడు. వరల్డ్‌ కప్ ఫైనల్‌లో ఓటమి తర్వాత ప్రధాని మోదీ తమతో సంభాషించడం.. పాక్‌లో తనపై వచ్చిన ట్రోలింగ్‌కు స్పందించాడు. తాజాగా తన డైట్‌, ఫిట్‌నెస్‌పై మాట్లాడాడు. 

‘‘నా డైట్‌ ప్లాన్‌ చాలా మారిపోయింది. ఇప్పుడు ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తా. అదీనూ నాన్‌వెజ్‌ను తీసుకుంటా. ఎందుకంటే నేనేమీ సప్లిమెంట్‌గా ఇతర ఫుడ్‌ను తీసుకోను. ఒకప్పుడు బిర్యానీ ఎక్కువగా తినేవాడిని. దాంతో చాలా మంది ఆటపట్టించేవారు. అప్పుడు నా డైట్‌కు ఒక ప్రణాళిక అంటూ ఉండేది కాదు. ఏది మంచిది.. ఏది అవసరం లేదనే విషయాలపై అవగాహన తక్కువ. దీంతో ఎక్కువగానే బిర్యానీ లాగించేసేవాడిని. ఎప్పుడైతే గాయపడ్డానో.. ఆ తర్వాత కఠినమైన డైట్‌గా పాటిస్తున్నా. ఫిట్‌నెస్‌ స్థాయి ఎంత కీలకమో అర్థం చేసుకున్నా. గతంతో పోలిస్తే ఇప్పటి నా డైట్‌ మారిపోయింది. నా ఫిట్‌నెస్‌ కూడా మెరుగైంది. 

చాలా మంది నేను బాగా బరువులు ఎత్తేస్తానని అనుకుంటారు. కానీ, వారందరే నాకంటే ఎక్కువగా బరువును ఎత్తుతారని అనుకుంటా. దీనిని సోషల్‌ మీడియాలో ఎప్పుడూ పెట్టలేదు. నేను ఏం చేస్తున్నాననదే ఆన్‌లైన్‌ వేదికగా పెట్టడం నాకిష్టం ఉండదు. అయితే, నేనేమీ చేయడం లేదని కూడా అనుకొనేవారు లేకపోలేదు. బెంచ్‌ ప్రెస్‌ ఎక్సర్‌సైజ్‌లో 150 కేజీలు, లెగ్‌ ప్రెస్‌ ఎక్సర్‌సైజ్‌లో 750 కేజీల వరకు చేయగలను’’ అని షమీ వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని